Tech Company | ఉన్నతమైన ఉద్యోగులను నిలుపుకునేందుకు కొన్ని సంస్థలు బోనస్‌లు, ప్రత్యేకమైన గిఫ్ట్స్ ఇస్తుంటాయి. అయితే, చైనాకు చెందిన ఓ టెక్ సంస్థ (Tech Company) అందుకు భిన్నంగా కొందరు ఉద్యోగులకు ఊహించని బహుమతులు ఇచ్చేందుకు సిద్ధమైంది. కష్టపడి పనిచేసే, నమ్మకమైన ఉద్యోగుల్లో కొంతమందికి ఖరీదైన ఇళ్లను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది.
ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ జెజియాంగ్ గుషెంగ్ ఆటోమోటివ్ టెక్నాలజీ (Zhejiang Guosheng Automotive Technology).. సంస్థలో దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉన్నతమైన ఉద్యోగులకు 18 రెసిడెన్షియల్ ఫ్లాట్స్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఒక్కో ఫ్లాట్ ధర రూ.1.3 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉంటుందని అంచనా (Rs 1.5 crore flats to employees ). ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. సంస్థలో దాదాపు 450 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో నైపుణ్యం కలిగిన చాలా మంది ఉద్యోగులకు శాశ్వత నివాసం లేదు. ఈ మేరకు వారిని నిలుపుకునేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగం కోసం వలస వెళ్లే కార్మికులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని నిశితంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ జనరల్ మేనేజర్ వాంగ్ జియాయువాన్ తెలిపారు. సంస్థకు సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నదని తెలిపారు. చాలా మంది ఉద్యోగులు శాశ్వత నివాసం లేక, అద్దెలు భారమై ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నట్లు చెప్పారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను వదులుకోలేక ఫ్లాట్ అలోకేషన్ పథకాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. ‘ఈఏడాది ఇప్పటి వరకూ ఐదు ఫ్లాట్స్‌ను పంపిణీ చేశాము. వచ్చే ఏడాది మరో ఎనిమిది కేటాయించాలని ప్లాన్ చేస్తున్నాము. మూడేండ్లలో మొత్తం 18 ఫ్లాట్స్‌ను ఉద్యోగులకు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాము’ అని తెలిపారు. మంచి నైపుణ్యాలు, అంకితభావం, కంపెనీ వృద్ధికి తోడ్పడే, మెరుగైన పనితీరు కనబరిచే సమర్థవంతమైన ఉద్యోగులను గౌరవించడమే ఈ పథకం లక్ష్యంగా పేర్కొన్నారు.
Also Read..
Mohan Bhagwat | భారత్ హిందూ దేశం.. రాజ్యాంగ ఆమోదం అవసరం లేదు : మోహన్ భగవత్
H-1B Visa | అపాయింట్మెంట్లు వాయిదా.. భారత్‌లో చిక్కుకుపోయిన వందలాది మంది H-1B వీసాదారులు
Air India | విమానంలో జీరోకి పడిపోయిన ఇంజిన్ ఆయిల్ ప్రెజర్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్..