H-1B Visa | ఈ నెల ప్రారంభంలో తమ వర్క్ పర్మిట్లను పనరుద్ధరించుకోవడానికి (Renew Work Permits) భారత్‌కు తిరిగి వచ్చిన వందలాది మంది H-1B వీసాదారులకు (H-1B Visa Holders) ఇబ్బందులు తప్పడం లేదు. అమెరికా కాన్సులర్ కార్యాలయాలు ఇప్పటికే ఖరారైన అపాయింట్మెంట్లను వాయిదా వేశాయి. డిసెంబర్ 15 -26 మధ్య షెడ్యూల్ చేసిన అపాయింట్మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. దీంతో వర్క్పర్మిట్ల పునరుద్ధరణ కోసం భారత్‌కు వచ్చిన వందలాది మంది హెచ్-1బీ వీసాదారులు ఇక్కడే చిక్కుకుపోయారు. ఈ సమయంలో అమెరికాలో సెలవుల కావడం, యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ విధానం కూడా ఈ పరిస్థితి కారణంగా తెలుస్తోంది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని వెలువరించింది.
హెచ్-1బీ, హెచ్-4 వీసాల దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమాల ఖాతాల ప్రాథమిక వడపోత, క్షుణ్ణమైన తనిఖీలను అమెరికా ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రభుత్వం వలసలపై కొరడాను ఝళిపిస్తున్న నేపథ్యంలో స్టేట్ డిపార్ట్మెంట్ (US State Department) ఈ నెల 3న జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ తనిఖీలు జరుగుతున్నాయి. అమెరికన్ వీసాను పొందడం గొప్ప అవకాశమని, అది ఒక హక్కు కాదని ఈ ఆదేశాలు పేర్కొన్నాయి. అమెరికాలోకి అనుమతించదగని వారిని గుర్తించేందుకు లోతుగా తనిఖీలు చేస్తున్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులపై ఆధారపడినవారు హెచ్-4 వీసా కోసం దరఖాస్తు చేస్తారు. హెచ్-1బీ, హెచ్-4, ఎఫ్, ఎం, జే నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులందరూ తమకు గల అన్ని సామాజిక మాధ్యమాల ఖాతాల ప్రైవసీ సెట్టింగ్స్‌ను ‘పబ్లిక్’కు మార్చాలని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఈ నెల 3న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. పూర్తి స్థాయి తనిఖీలు (వెట్టింగ్)లో అందుబాటులో ఉన్న అన్ని రకాల సమాచారాన్ని ఉపయోగించుకుని అమెరికాలోకి అనుమతించదగని వారిని గుర్తిస్తామని తెలిపింది. జాతీయ భద్రతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అగ్రరాజ్యం తెలిపింది.
Also Read..
Air India | విమానంలో జీరోకి పడిపోయిన ఇంజిన్ ఆయిల్ ప్రెజర్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్..
Gulmarg | స్కీయింగ్ సిటీపై మంచు దుప్పటి.. శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న టూరిస్ట్‌లు