Air India | ఎయిర్ ఇండియా (Air India) విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా.. ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఆయిల్ ప్రెజర్ సున్నాకి పడిపోయింది. గమనించిన పైలట్లు వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు. విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
బోయింగ్ 777-337 ER విమానం AI887.. సోమవారం తెల్లవారుజామున 3:20 గంటల సమయంలో ఢిల్లీలోని ఇందిగా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ముంబైకి (Delhi To Mumbai flight) బయల్దేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్‌లో ఆయిల్ ప్రెజర్ గణనీయంగా తగ్గిపోయింది. కుడివైపు ఇంజిన్‌లో అసాధారణంగా తక్కువ ఆయిల్ ప్రెజర్‌ను పైలట్లు గమనించారు. కాసేపటికే ఆయిల్ ప్రెజర్ సున్నాకి పడిపోయింది (engine oil pressure drops to zero). అప్రమత్తమైన పైలట్లు వెంటనే అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. అధికారుల సూచనల మేరకు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ‘డిసెంబర్ 22న ఢిల్లీ నుంచి ముంబైకి బయల్దేరిన AI887 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ఢిల్లీకి తిరిగి వచ్చింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Also Read..
Gulmarg | స్కీయింగ్ సిటీపై మంచు దుప్పటి.. శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న టూరిస్ట్‌లు
Air India | ఎయిరిండియా కీలక నిర్ణయం.. శాన్ఫ్రాన్సిస్కోకు డైరెక్ట్ విమానాలు బంద్!
రైలు టికెట్ చార్జీల పెంపు.. 26 నుంచి అమల్లోకి…