న్యూఢిల్లీ: ఆరు నెలల వ్యవధిలో రైల్వే శాఖ మరోసారి ప్రయాణికుల చార్జీలు పెంచింది. పెరిగిన చార్జీలు ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. సబర్బన్ రైలు ప్రయాణ చార్జీలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం&. 215 కిలోమీటర్ల ప్రయాణం వరకు జనరల్ క్లాస్ టికెట్ ధరల్లో మార్పు ఉండదు. అంత కన్నా ఎక్కువ దూరం ప్రయాణిస్తే, ప్రతి కి.మీ.కి ఒక పైసా చొప్పున చార్జీ పెరుగుతుంది. మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ క్లాస్ టికెట్ చార్జీలు ప్రతి కి.మీ.కి రెండు పైసల చొప్పున పెరుగుతాయి. ఏసీ క్లాస్ ప్రయాణానికి కూడా ప్రతి కి.మీ.కి రెండు పైసల చొప్పున టికెట్ చార్జీ పెరుగుతుంది.
ఈ కొత్త చార్జీలు అమల్లోకి వస్తే, నాన్ ఏసీ క్లాస్‌లో 500 కి.మీ ప్రయాణానికి టికెట్ ధర రూ.10 పెరుగుతుంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ ప్రయాణ టికెట్ చార్జీలు ప్రతి కి.మీ.కి ఒక పైసా చొప్పున పెరిగింది, ఏసీ క్లాస్‌లో ప్రతి కి.మీ.కి రెండు పైసల చొప్పున పెరిగింది. ఈ పెంపు వల్ల సంవత్సరానికి రూ.600 కోట్ల ఆదాయం రైల్వేలకు సమకూరుతుంది. గడచిన దశాబ్దంలో నెట్వర్క్, కార్యకలాపాలను గణనీయంగా విస్తరించినట్లు రైల్వేలు ప్రకటించింది. ఉద్యోగుల సంఖ్యను కూడా పెంచినట్లు తెలిపింది. ఉద్యోగుల కోసం ఖర్చులు రూ.1,15,000 కోట్లకు పెరిగినట్లు, పింఛను వ్యయం రూ.60 వేల కోట్లకు పెరిగినట్లు వివరించింది. ఈ ఖర్చులను భరించడం కోసం కార్గో లోడింగ్, ప్రయాణికుల టిక్కెట్ చార్జీల పెంపుపై దృష్టి పెట్టినట్లు పేర్కొంది.
పూర్తి స్థాయిలో విద్యుదీకరణ చేసిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఆచరణలో ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉందని పార్లమెంటరీ స్థాయీ సంఘం హెచ్చరించింది. ప్రత్యేక అత్యధిక సామర్థ్యంగల ట్రాక్‌లతో ఈ కారిడార్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రచిస్తున్నారని, అయితే, సిబ్బంది అందుబాటులో ఉండటం వంటి నిర్వహణ పరమైన అడ్డంకులను సక్రమంగా పరిష్కరించకపోతే, ఈ స్వప్నం సాకారమయ్యే అవకాశం ఉండదని తెలిపింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్) రైళ్లను నడపడంలో ఎదుర్కొనే అతి పెద్ద సవాల్ సిబ్బంది లభ్యత అని రైల్వే శాఖ అంగీకరించింది.
ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ హెచ్చరిక చేసింది. 2025 జూన్ 1 నాటికి రైల్వేలలో రైళ్ల నిర్వహణలో ఉన్న వివిధ కేటగిరీలలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను ఈ కమిటీకి రైల్వే శాఖ తెలిపింది. లోకో పైలట్ ఉద్యోగాలు 1,42,814 కాగా, పని చేస్తున్నవారు 1,07,928 మంది అని పేర్కొంది. 22,082 గూడ్స్ రైలు మేనేజర్స్ (గార్డులు) ఉద్యోగాలు 22,082 కాగా, పని చేస్తున్నవారు 12,345 మంది అని తెలిపింది. స్టేషన్ మాస్టర్లు, స్టేషన్ సూపరింటెండెంట్లు సహా అన్ని కేటగిరీల్లోనూ 2,06,495 ఉద్యోగాలు ఉండగా, 1,59,219 ఉద్యోగాలు భర్తీ అయినట్లు పేర్కొంది.
సరుకు రవాణాలో ఆలస్యాన్ని, కనిష్ట స్థాయికి తగ్గించడానికి, డీఎఫ్సీ నెట్‌వర్క్‌లో అంతరాయాలు లేకుండా సరుకు రవాణా జరగడానికి వీలుగా సిబ్బంది కొరత సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టం చేసింది. డీఎఫ్సీ నెట్‌వర్క్‌లో సజావుగా రైళ్ల కార్యకలాపాలు జరగాలంటే తగినంత మంది సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఫ్రైట్ ద్వారా వచ్చే ఆదాయం కారణంగానే రైల్వేలు సాధారణ ప్రజానీకానికి టిక్కెట్ ధరలను అందుబాటులో ఉంచగలుగుతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. రైలు బోగీలు, వ్యాగన్లపై వాణిజ్య ప్రకటనలు ఆచరణ సాధ్యమైన ఆదాయ మార్గమని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంది.