న్యూయార్క్, మే 13: ఇప్పటివరకు పెట్రోల్, విద్యుత్తుతో నడిచే ద్విచక్ర వాహనాలను మనం వినియోగిస్తున్నాం. గతంలో డీజిల్ బైకులు కూడా ఉండేవి. గ్యాస్‌తో నడిచే బైకులు కూడా కొన్ని దేశాల్లో తయారుచేశారు. వీటన్నింటికీ భిన్నంగా అమెరికాలోని బ్లూమింగ్టన్‌కు చెందిన కై మైకెల్సన్ అనే వ్యక్తి బీర్‌తో నడిచే బైక్‌ను తయారుచేశారు. ఇందులో హీటింగ్ కాయిల్‌తో కూడిన 14-గాలన్ కెగ్ను ఏర్పాటు చేశారు.
ఈ హీటింగ్ కాయిల్ బీర్‌ను 300 డిగ్రీల వరకు వేడి చేస్తుందని, అప్పుడు ఉత్పత్తయ్యే ఆవిరితో బైక్ నడుస్తుందని మైకెల్సన్ చెప్తున్నారు. బీర్ మాత్రమే కాదు రెడ్ బుల్, కాఫీ వంటి ఏదైనా ద్రవపదార్థంతో ఈ బైక్ నడిపించొచ్చని అంటున్నారు. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చని, అయితే ఈ బైక్‌ను మాత్రం తన మ్యూజియంలో పెట్టనున్నట్టు తెలిపారు. మైకెల్సన్ గతంలోనూ ఇలాంటి విభిన్న ఆవిష్కరణలు చాలానే చేశారు. వీటి కోసం ఏకంగా ఓ మ్యూజియంనే నిర్వహిస్తున్నారు.