Zelensky | న్యూఢిల్లీ: అది ఫిబ్రవరి 28, 2025. రెండవసారి అధికారం చేపట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సాక్షిగా తన ఆధిపత్య లక్షణాలను బయట పెట్టుకోగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బలంగా ఆయనను ఎదుర్కొన్నారు. ట్రంప్ దురుసు వ్యాఖ్యలకు ఆయన దీటుగా బదులిచ్చారు. ఖనిజ ఒప్పందం కుదుర్చుకోవలసిన సందర్భం కాస్తా రసాభాసగా మారిపోయింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంతానికి అమెరికా జోక్యం చేసుకోవాలని కోరడానికి వచ్చిన జెలెన్స్కీతో ట్రంప్ ఢీకొన్నారు.
జెలెన్స్కీకి స్వాగతం పలుకుతూ ప్రసంగం ప్రారంభించిన ట్రంప్ ప్రసంగానికి అడ్డుపడిన జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని హంతకుడిగా అభివర్ణించారు. ట్రంప్‌కు కొన్ని ఫొటోలు చూపిస్తూ అవన్నీ ఉక్రెయిన్ ప్రజల పట్ల రష్యా చేసిన అకృత్యాలని అన్నారు. అయితే దీన్ని పట్టించుకోకుండా ప్రసంగాన్ని కొనసాగించిన ట్రంప్ పుతిన్‌తో కూడా తాను మాట్లాడానని, రష్యా రెండోసారి దాడి చేయదని తాను నమ్ముతున్నానని అన్నారు. ఇంతలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ జోక్యం చేసుకుంటూ శాంతి స్థాపన కోసం గత బైడెన్ ప్రభుత్వం తీసుకున్న వైఖరి సరిగ్గా లేదని విమర్శించారు. రష్యాను చర్చల వేదిక వద్దకు తెచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం దౌత్యాన్ని ప్రదర్శిస్తోందంటూ వాన్స్ చెప్పారు. దీంతో మండిపడిన జెలెన్స్కీ.. పుతిన్‌ను అమెరికా ఇప్పటివరకు అడ్డుకోలేదని చెబుతూ ‘ఏ రకమైన దౌత్యాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారు జేడీ?’ అని ప్రశ్నించారు. రష్యా ప్రభావాన్ని అమెరికా ఇప్పుడు గుర్తించే పరిస్థితిలో లేదని, భవిష్యత్తులో అమెరికాకూ అనుభవంలోకి వస్తుందని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.
మీ దేశం పెద్ద సమస్యలో ఉంది అని ట్రంప్ చెబుతుండగా తాను జవాబిస్తానని జెలెన్స్కీ అన్నారు. వద్దు వద్దు. ఇప్పటికే మీరు చాలా మాట్లాడారు. మీరు గెలవడం లేదు. మా సాయంతోనే మీరు గట్టి పోరాటం చేశారు. మేం లేకపోతే మీరు అలా చేయలేరు. మీ ప్రజలు చనిపోతున్నారు. మీ సైనికులు తగ్గిపోయారు. మాతో వస్తే బయటపడే చక్కని అవకాశం ఉంది. కాల్పుల విరమణకు అంగీకరిస్తే మీ సైనికులు ప్రాణాలతో మిగులుతారు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. దీనికి జెలెన్స్కీ బదులిస్తూ ‘మేము మా దేశంలో ఉంటున్నాం. బలంగా ఉన్నాం. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాం’ అని స్పష్టంచేశారు. తమ సైనిక సాయం లేకపోతే ఈ యుద్ధం రెండువారాల్లోనే ముగిసిపోయేదని ట్రంప్ వ్యాఖ్యానించగా, మూడురోజుల్లోనే ఆగిపోతుందని పుతిన్ కూడా అన్నారంటూ జవాబిచ్చారు. దీంతో ఆగ్రహం చెందిన ట్రంప్ మీరు ఒప్పందం చేసుకోకపోతే మేం వైదొలగుతాం. అప్పుడు మీరే పోరాడాలి. మీరు కృతజ్ఞతాపూర్వకంగా ఉండడం లేదు. అది బాగాలేదు. చాలా చూశాం. ఇక మీరు వెళ్లవచ్చు. ఇదో గొప్ప టెలివిజన్ షో అవుతుంది అంటూ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు.