వాషింగ్టన్, సెప్టెంబర్ 13: ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమని అమెరికా భావిస్తున్నది. అందులో భాగంగా ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలను లక్ష్యంగా చేసుకోవాలని చూస్తున్నది. ఈ క్రమంలో ఈయూ, జి-7 దేశాలు భారత్, చైనాలపై సుంకాలు విధించాలని ట్రంప్ పాలకవర్గం ప్రతిపాదనలు చేసింది. ఇందుకు జి-7 సభ్య దేశాలు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తున్నది. జి-7దేశాల ఆర్థిక మంత్రులు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుకున్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై 50 శాతం సుంకాలు విధించటం సాధారణ విషయం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దీనివల్ల భారత్‌లో విభేదాలు ఏర్పడే పరిస్థితి వచ్చిందని అన్నారు.
శుక్రవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, రష్యా చమురుకు భారత్ అతిపెద్ద వినియోగదారుగా మారిందని విమర్శించారు. రష్యా మిత్ర దేశమైన భారత్‌పై భారీగా సుంకాలు విధించటం ద్వారా ఒకరకంగా మాస్కోపై చర్యలు తీసుకున్నట్టేనని చెప్పారు.