Qatar | హైదరాబాద్, జూన్ 24 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య గడిచిన 12 రోజులుగా కొనసాగిన యుద్ధానికి కాల్పుల విరమణ ఒప్పందంతో తెరపడింది. ఇరు దేశాల మధ్య సయోధ్య కోసం ఇజ్రాయెల్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంప్రదింపులు జరిపినప్పటికీ ఇరాన్‌తో కుదరలేదు. దీంతో ట్రంప్ కోరిక మేరకు రంగంలోకి దిగిన ఖతార్.. ఇరాన్‌ను ఒప్పించింది. మొత్తంగా ఖతార్ మధ్యవర్తిత్వం కారణంగానే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి తెరపడిందని చెప్పొచ్చు. దీంతో 30 లక్షల జనాభా కూడా లేని ఈ పశ్చిమాసియా దేశంపై అందరి దృష్టి పడింది. అయితే, అంతర్జాతీయ సంఘర్షణలను పరిష్కరించడం ఖతార్‌కు కొత్తేంకాదు. గల్ఫ్ నుంచి ఆఫ్రికా వరకూ పలు దేశాల మధ్య నెలకొన్న వివాదాలను గతంలో ఖతార్ విజయవంతంగా పరిష్కరించింది కూడా.
సెప్టెంబర్ 11, 2001 దాడి తర్వాత అఫ్గానిస్థాన్‌పై అమెరికా దాడి చేయడం ద్వారా తాలిబన్లపై యుద్ధాన్ని ప్రారంభించింది. అయితే, 2013లో తాలిబన్లకు దోహాలో కార్యాలయాన్ని తెరువడానికి ఖతార్ అనుమతినిచ్చింది. విదేశాలలో తాలిబన్లకు మొదటి కార్యాలయం ఇదే. రెండు దశాబ్దాల అనంతరం అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెనక్కి రావడం, అఫ్గాన్‌లో తాలిబన్ల పాలన మొదలయ్యేలా ఒప్పందం జరుగడానికి ఈ దోహా కార్యాలయమే కేంద్రంగా మారింది. దీని కోసం ఖతార్ ఏండ్లుగా మధ్యవర్తిత్వం వహించింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోనూ మధ్యవర్తిగా ఖతార్ ముఖ్యమైన పాత్ర పోషించింది. 2023లో ఖతార్ మధ్యవర్తిత్వం కారణంగానే ఇరు దేశాలకు చెందిన 15 మంది చొప్పున పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల వద్దకు చేరుకోగలిగారు.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిలో హమాస్ ఉగ్రవాదులు కనీసం 250 మందిని బందీలుగా తీసుకున్నారు. హమాస్ చెర నుంచి ఖైదీలను విడిపించడంలో ఖతార్ ముఖ్యమైన పాత్ర పోషించింది. గాజాలో మానవతా కార్యకలాపాలు, మౌలిక వసతుల కల్పన ద్వారా హమాస్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి.
2008లో లెబనాన్‌లో అంతర్యుద్ధాన్ని ముగించడంలో ఖతార్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే దోహా ఒప్పందం తెరమీదకు తీసుకొచ్చింది. లెబనాన్ ప్రభుత్వంలో హెజ్బొల్లాకు ప్రాధాన్యాన్ని కల్పించడానికి కృషి చేసింది. 2011తో పాటు 2020లో సూడాన్‌లో పెచ్చరిల్లిన సంక్షోభానికి, పౌర నిరసనలకు కూడా ఖతార్ తన మధ్యవర్తిత్వంతో పరిష్కారం చూపింది.
ఖతార్‌లో చమురు నిక్షేపాలు అపారం. దీంతో చిన్న దేశమైనా ఆర్థిక పరమైన శక్తిగా ఖతార్ అవతరించింది. ఈ క్రమంలో పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టింది. మౌలిక వసతుల ప్రాజెక్టులకు తన వంతు సాయాన్ని అందిస్తున్నది. దేశాధినేతలతో పాటు హమాస్, హెజ్బొల్లా వంటి సంస్థలతోనూ సఖ్యతగా ఉంటున్నది. ఈ కారణంగానే ఖతార్ ప్రతిపాదనలకు ప్రతీ దేశం ప్రాధాన్యాన్ని ఇస్తున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు.