లంచం ఆరోపణలపై అమెరికాలో కేసును ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీకి కెన్యా సర్కారు భారీ షాక్ ఇచ్చింది. 30 ఏండ్ల కోసమని అదానీ కంపెనీతో చేసుకొన్న విద్యుత్తు సరఫరా లైన్ల కాంట్రాక్టుతో పాటు జోమో కెన్యాట్టా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కాంట్రాక్ట్‌ను కూడా రద్దు చేసుకొంటున్నట్టు ఆ దేశాధ్యక్షుడు విలియం రూటో గురువారం తెలిపారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో కెన్యా సర్కారు 736 డాలర్లకు అదానీ కంపెనీతో విద్యుత్తు సరఫరా లైన్ల ఒప్పందాన్ని గతంలో చేసుకొన్న విషయం తెలిసిందే. ఇక, జోమో కెన్యాట్టా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును అదానీ గ్రూప్‌నకు అప్పగించవద్దంటూ ప్రజాందోళనలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయాన్ని ఇటీవలే ప్రభుత్వం తాత్కాలికంగా పక్కనబెట్టింది. తాజాగా ఈ రెండు ప్రాజెక్టులను రద్దు చేసింది.