న్యూఢిల్లీ : పసిఫిక్ దీవుల దేశం తువాలులో ఈ నెల 15న మొదటి ఏటీఎంను ప్రారంభించారు. ఈ చారిత్రక ఘట్టం సందర్భంగా ప్రధాని ఫెలెటి టియో నాయకత్వంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఆయన భారీ చాకొలెట్ కేక్‌ను కట్ చేశారు. ఇది అద్భుత విజయమని వ్యాఖ్యానించారు. నేషనల్ బ్యాంక్ జనరల్ మేనేజర్ సియోస్ టియో మాట్లాడుతూ, ప్రజల ఆర్థిక సాధికారతకు తలుపులు తెరిచే పరివర్తక మీట ఈ ఏటీఎం అని తెలిపారు.
ఆస్ట్రేలియా-హవాయి మధ్య 25 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ దేశం ఉంది. తొమ్మిది దీవులతో కూడిన ఈ దేశంలో 11,200 మంది నివసిస్తున్నారు. ఫునఫుటిలో ఎయిర్పోర్ట్ ఉంది. పొరుగున గల ఫిజీ నుంచి వారానికి కొన్ని విమానాలు మాత్రమే ఇక్కడికి వస్తాయి.