Donald Trump | వాషింగ్టన్, నవంబర్ 5: అమెరికాకు మరోసారి అధ్యక్షుడిని కావాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన అధ్యక్షుడు కావాలంటే ‘బ్లూ వాల్’ను బ్రేక్ చేయాల్సిందే అని అంటున్నారు అమెరికా పొలిటికల్ పండిట్లు. సంప్రదాయంగా డెమోక్రటిక్ పార్టీకి మద్దతిచ్చే రాష్ర్టాలను ‘బ్లూవాల్’ స్టేట్స్ అంటారు. ఇవి 18 రాష్ర్టాలు ఉన్నాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినాయిస్, పెన్సిల్వేనియా, మిషిగన్, న్యూజెర్సీ, వాషింగ్టన్, మసాచుసెట్స్, మేరీల్యాండ్, మిన్నెసోటా, విస్కాన్సిన్, ఓరెగావ్, కనెక్టికట్, హవాయ్, మైనె, రోడ్ ఐలాండ్, డెలావర్, వెర్మాంట్ రాష్ర్టాలను బ్లూ వాల్ స్టేట్స్ అంటారు.
వీటిల్లో 238 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు కావాలి. కాబట్టి, ఈ బ్లూవాల్ స్టేట్లను కనుక కమలా హారిస్ నిలుపుకోగలిగితే అధ్యక్షురాలు కావడం సులభం. ట్రంప్ గెలవాలంటే ఈ 18 రాష్ర్టాల్లో కొన్నింటినైనా తన వైపు తిప్పుకోవాలి.
1992 నుంచి 2012 వరకు ఈ రాష్ర్టాలు ఏకపక్షంగా డెమోక్రటిక్ పార్టీ వైపు నిలిచాయి. 2016 ఎన్నికల్లో మాత్రం పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్ రాష్ర్టాలను అనూహ్యంగా రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ దక్కించుకున్నారు. ఈ మూడు రాష్ర్టాల్లో కలిపి 44 ఓట్లు ఉన్నాయి. ట్రంప్ అధ్యక్షుడు కావడానికి ఈ ఓట్లు కలిసొచ్చాయి.