న్యూయార్క్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై 50 శాతం సుంకాలు (Trump Tariffs) విధించడం సాధారణ విషయం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. దీనివల్ల భారత్‌తో విభేదాలు ఏర్పడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. శుక్రవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా చమురుకు భారత్ అతిపెద్ద వినియోగదారుగా మరిందని విమర్శించారు. ఆ దేశం నుంచి చమురు కొంటున్నందుకే న్యూఢిల్లీపై 50 శాతం సుంకాలు విధించక తప్పలేదని వెల్లడించారు. నిజానికి అది చాలా పెద్ద చర్య అని, దానిని మామూలు విషయంగా భావించడానికి వీల్లేదని తెలిపారు.
దీంతో భారత్‌తో విభేదాలు వచ్చాయని, అయినా నేను చర్యలు తీసుకున్నానని తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. రష్యా మిత్రమైన భారత్‌పై భారీగా సుంకాలు విధంచడం ద్వారా ఒకరకంగా మాస్కోపై చర్యలు తీసుకున్నట్లేనని చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య ఏడు యుద్ధాలను నివారించానని మరోసారి చెప్పుకున్నారు. అందులో భారత్-పాక్ యుద్ధం కూడా ఉన్నదని పునరుద్ఘాటించారు. ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న వాటిని కూడా పరిష్కరించానని వెల్లడించారు.