వాషింగ్టన్, డిసెంబర్ 17: పాకిస్థాన్‌ను కేంద్రంగా చేసుకొని ఉగ్రవాద ముఠాలు భారత్‌పై దాడులకు తెగబడుతున్నాయని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అయినప్పటికీ పాక్ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నది. ముంబై దాడుల సూత్రధారి మసూద్ అజర్, ఉగ్రవాది సాజిద్ మీర్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారని వెల్లడించింది. 2020కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు, కట్టడి చర్యలపై అమెరికా విదేశాంగ శాఖ గురువారం వార్షిక నివేదికను విడుదల చేసింది. ‘లష్కరే తాయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ఐసిస్, అల్ కాయిదా ఉగ్ర సంస్థలు భారత ఉపఖండంలో ఇంకా క్రియాశీలంగా ఉన్నాయి. జమ్ముకశ్మీర్, ఈశాన్య భారతం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ గ్రూపులు ఉగ్రదాడులకు పాల్పడుతున్నాయి’ అని అందులో పేర్కొన్నది. ఇటీవల కేరళ, బెంగాల్లో అల్‌కాయిదా ఉగ్రవాదులను అరెస్టు చేయడాన్ని అమెరికా విదేశాంగ శాఖ తన నివేదికలో ప్రస్తావించింది. భారత సంతతికి చెందిన 66 మంది ఐసిస్‌లో చేరినట్టు వెల్లడించింది.