గురువారం 03 డిసెంబర్ 2020
International - Oct 19, 2020 , 17:05:41

అమెరికాలో మన తెలుగుకు అందలం

అమెరికాలో మన తెలుగుకు అందలం

వాషింగ్టన్‌ : అమెరికాలో మన తెలుగు భాషకు గౌరవం దక్కింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ప్రజలకు సమాచారం అందించేందుకు అధికారిక భాషగా తెలుగు భాషను గుర్తించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. త్వరలో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్‌ పేపర్‌ సమాచారాన్ని తెలుగు భాషలో కూడా పేర్కొని భారతీయులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3 న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటరు బ్యాలెట్ పేపర్ వివిధ భాషల్లో ముద్రిస్తారు. ఈ నేపథ్యంలో హిందీ సహా కొన్ని భారతీయ భాషలతో పాటు ఓటరు బ్యాలెట్ పేపర్‌లోని అధికారిక భాషల జాబితాలో తెలుగు భాష కూడా చేర్చారు. దీనితో ఎన్నికల ప్రక్రియతోపాటు అమెరికాలో జరిగే అన్ని అధికారిక కార్యకలాపాల్లో ఇక మీదట విషయాన్ని తెలుగులో వివరించనున్నారు. తెలుగు మాట్లాడేవారికి కూడా ఇప్పటివరకు ఉన్నదానికి అదనంగా మరింత ప్రత్యేక గుర్తింపు లభించనున్నది.

ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటి. అయితే, తెలుగును ప్రాచీన భాషగా గుర్తించడానికి చాలా సమయం పట్టింది. అయినప్పటికీ తెలుగు ప్రజలు తమ మాతృభాషను కాపాడుకుంటూ ప్రపంచమంతా విస్తరించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారు 15 కోట్ల దాకా ఉంటారని ఒక అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 9 కోట్ల మంది (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే ఎక్కువగా) తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. ఈ 9 ఏండ్లలో ఈ సంఖ్య విపరీతంగా పెరిగింది. భారతదేశంలో ప్రాచీన భాషలుగా ఆరు భాషలకు మాత్రమే గుర్తింపు ఉండగా.. వాటిలో తెలుగు కూడా ఉండటం విశేషం.

అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య రాన్రానూ విపరీతంగా పెరుగుతున్నది. చాలా మంది తెలుగువారు ఉన్నత చదువులు, పరిశోధనల నిమిత్తం అమెరికా వెళ్లి స్థిరపడుతున్నారు. చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉండి రెండు దేశాలకు గర్వకారణంగా నిలుస్తున్నారు. అందుకే అక్కడి ప్రభుత్వం తెలుగును వ్యవహారిక భాషగా గుర్తించక తప్పలేదని నిపుణులు భావిస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.