మల్వౌకీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి అవసరమయ్యే డబ్బు కోసం నికిత కాసాప్ (17) తన తల్లిదండ్రులను చంపేశాడు. ఇటీవల జారీ అయిన ఫెడరల్ వారంట్ ప్రకారం, నికిత తన తల్లి తాతియానా (35), సవతి తండ్రి డొనాల్డ్ మేయర్ (51)లతో కలిసి మిల్వౌకీ శివారులో ఉంటున్నాడు. వీరిద్దరినీ ఫిబ్రవరిలో ఇంట్లోనే కాల్చి చంపేశాడు. శవాలు కుళ్లిపోయే వరకు కొన్ని వారాలపాటు అక్కడే ఉన్నాడు. అనంతరం 14,000 డాలర్ల నగదు, పెంపుడు కుక్క, పాస్‌పోర్టులను తీసుకుని పారిపోయాడు. అతనిని కాన్సాస్‌లో గత నెలలో అరెస్ట్ చేశారు. ట్రంప్‌ను హత్య చేయడానికి డ్రోన్, పేలుడు పదార్థాలు కొనడం కోసం తల్లిదండ్రుల వద్దనున్న డబ్బును వినియోగించాలనుకున్నాడు. ఈ ప్రణాళికను ఇతరులతో కూడా పంచుకున్నాడు. యూదు వ్యతిరేక మేనిఫెస్టోను సిద్ధం చేశాడు. టిక్‌టాక్, టెలిగ్రామ్ మెసెంజర్ యాప్‌లలో అతను జరిపిన సంభాషణలను కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు.