Target India : రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని బూచిగా చూపి అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్ (India) పై భారీగా సుంకాల భారాన్ని మోపారు. ప్రస్తుతం భారత దిగుమతులపై అమెరికాలో 50 శాతం టారిఫ్‌లు అమలులో ఉన్నాయి. ఈ క్రమంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తమలాగే భారత్‌ను లక్ష్యంగా చేసుకోవాలని యూరప్ దేశాలను వైట్‌హౌస్ (White house) కోరినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపకపోతే అమెరికా మాదిరిగానే భారత్‌పై సుంకాలను పెంచాలని ట్రంప్ యంత్రాంగం యూరప్ దేశాలను కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆంక్షలు విధించడంతోపాటు భారత్ నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును నిలిపివేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపే విషయంపై చర్చించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇటీవల ట్రంప్ భేటీ అయ్యారు.
యుద్ధం ముగించేందుకు అగ్రరాజ్యాధిపతి తీసుకుంటున్న చర్యలకు కొంతమంది యూరోపియన్ నాయకులు మద్దతు పలికినట్లు సమాచారం. అయితే భారత్‌కు వ్యతిరేకంగా ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై యూరోపియన్ దేశాలు మౌనంగా ఉన్నాయి. సుంకాలు విధించడాన్ని సమర్థించలేదు. అలా అని తప్పుబట్టలేదు. ఈ క్రమంలో భారత్‌ను లక్ష్యంగా చేసుకోవాలని ట్రంప్ పరిపాలనాధికారులు కోరడం గమనించాల్సిన విషయం.