బీజింగ్: ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడింది చైనా. తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వం ఆ దేశంలో అరాచకానికి తెర దించిందని చైనా అనడం గమనార్హం. అయితే తాలిబన్లు దీర్ఘకాలిక రాజకీయ ప్రణాళికను రూపొందించాలని, దేశీయ, విదేశీ విధానాలను సిద్ధం చేసుకోవాలని చైనా సూచించింది. మంగళవారం ముల్లా హసన్ నేతృత్వంలో తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వ ఏర్పాటును మేము నిశితంగా గమనించాం. ఇది ఆఫ్ఘనిస్థాన్‌లో మూడు వారాలపాటు ఉన్న అరాచకానికి తెర దించింది అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు.
తాలిబన్ల ప్రభుత్వం తమ భూభాగంలోని అన్ని ఉగ్రవాద శక్తులతో పోరాడాలని, అన్ని దేశాలతో ముఖ్యంగా పొరుగు దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కొత్త ప్రభుత్వాన్ని చైనా గుర్తిస్తుందా అని ప్రశ్నించగా.. ఇప్పటికీ చైనా ఎంబసీ ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నదని వాంగ్ అన్నారు. చైనాతోపాటు పాకిస్థాన్, రష్యా ఎంబసీలు కూడా ఇప్పటికీ ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నాయి.