Nara Rohit | వైవిధ్యమైన కథలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు నారా రోహిత్ వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి తెరలేపనున్నారు. ఆయన భార్య శిరీష లేళ్ల ప్రస్తుతం గర్భవతిగా ఉండటంతో, ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. రీసెంట్గా ఈ దంపతులకు సంబంధించిన బేబీ బంప్ ఫోటోషూట్ వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో, అది క్షణాల్లో వైరల్‌గా మారింది. వీడియోలో రోహిత్, శిరీషలు ఎంతో ఆనందంగా కనిపించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నారా రోహిత్, శిరీషల పరిచయం ప్రతినిధి 2 సినిమా షూటింగ్ సమయంలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో శిరీష హీరోయిన్గా నటించగా, ఆ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల సమ్మతితో ఈ ప్రేమ వివాహంగా మారింది. ముఖ్యంగా రోహిత్ కుటుంబ సభ్యురాలు నారా భువనేశ్వరి ఈ సంబంధాన్ని ముందుండి జరిపించడం విశేషం.
అక్టోబర్ 30, 2025న హైదరాబాద్‌లో ఈ జంట వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు.వారి పెళ్లి, రిసెప్షన్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక శిరీష నేపథ్యం చూస్తే..ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా రెంటచింతల గ్రామానికి చెందిన శిరీష చదువులోనూ రాణించారు. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత అక్కడ కొంతకాలం ఉద్యోగం చేశారు. సినిమాలపై ఆసక్తితో భారత్‌కు వచ్చి మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి, ఆ తర్వాత ‘ప్రతినిధి 2’తో టాలీవుడ్లోకి ప్రవేశించారు.
నారా రోహిత్ సినీ ప్రయాణం చూస్తే.. 2009లో వచ్చిన బాణం సినిమాతో హీరోగా పరిచయమైన రోహిత్, తన ప్రత్యేకమైన శైలితో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ‘సోలో’, ‘ప్రతినిధి’, ‘రౌడీ ఫెలో’, ‘అసుర’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ప్రయోగాత్మక సినిమాలు నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల వరుస సినిమాలతో బిజీగా ఉన్న రోహిత్, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో తండ్రిగా కొత్త పాత్రలోకి అడుగుపెట్టబోతుండటంతో నారా కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది.