చెన్నై, ఏప్రిల్ 30: ద్రవిడ పార్టీల ఆధిపత్యం ఉన్న తమిళనాడులో నటుడి నుంచి రాజకీయ నేతగా మారిన విజయ్ సంచలనం సృష్టిస్తారా? నటులు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన చరిత్ర ఉన్న రాష్ట్రంలో విజయ్ ఆ పీఠాన్ని అధిరోహించి మరో ఎంజీఆర్ అవుతారా? నటులకు పట్టం గట్టే రాష్ట్ర ప్రజలు తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తారా? ఇప్పుడు తమిళగడ్డపై పౌరుల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చ ఇది. ఎన్నికల్లో నటుడు విజయ్‌కు అనూహ్య ఆదరణ లభించిందని పోలింగ్ సరళిని బట్టి పలువురు అంచనా వేయగా, తాజాగా, బుధవారం వెలువడిన యాక్సిస్ మై ఇండియా, మరో సంస్థ ఎగ్జిట్ పోల్ ఈ అంశాన్ని మరింత బలపరిచింది.
దశాబ్దాల సినీ ప్రస్థానం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఎంజీఆర్ అక్కడ కూడా పూర్తిగా విజయవంతం అయ్యారు. మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఏఐఏడీఎంకే పార్టీని స్థాపించిన ఆయన రాజకీయాల్లో ఎంతో ప్రభావవంతమైన వ్యక్తిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన నీడలో ఉండి, దిగ్గజ నేతగా ఎదిగిన జయలలిత కూడా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఎంజీఆర్ వారసురాలిగా ఆమె రాష్ర్టాన్ని 14 ఏండ్ల ఆరు నెలలు పాలించారు. ‘అమ్మ’గా ప్రజల్లో పేరొందిన ఆమె కూడా అనేక ప్రజాకర్షక పథకాలతో పౌరుల గుండెల్లో నిలిచిపోయారు.
విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ ఈ ఎన్నికల్లో 98-120 సీట్లతో సంచలనం సృష్టిస్తుందని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సంస్థ అంచనా వేసింది. తాము విజయ్‌నే ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని 37 శాతం మంది పేర్కొనగా, ఆ తర్వాత స్థానంలో స్టాలిన్ ఉన్నారు. తమిళనాడులో టీవీకే బలమైన పార్టీగా ఆవిర్భవిస్తుందని టుడేస్ చాణక్య అనే సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌పోల్‌లోనూ వెల్లడైంది. ఈ సంస్థ అంచనా ప్రకారం రాష్ట్రంలో టీవీకే సుమారు 63 స్థానాలను, 30 శాతం ఓట్ల వాటాను సాధిస్తూ బలమైన పార్టీగా అరంగేట్రం చేయనుంది.
ఇది డీఎంకే తర్వాత స్థానంలో నిలువనుంది. అదే నిజమైతే రాష్ట్రంలో రాజకీయ పరిణామాల మార్పునకు టీవీకే శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతానికి ఈ పార్టీకి బీసీల్లో 29 శాతం, బాగా వెనుకబడిన తరగతుల్లో 27 శాతం, ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవుల్లో 34 శాతం ఆదరణ ఉందని, ఇది కుల హద్దులను అధిగమించిన విషయాన్ని తెలియజేస్తున్నదని సర్వే తెలిపింది. అలాగే అధికార డీఎంకే తర్వాత అధిక శాతం ముస్లింలు ఈ పార్టీ పట్ల ఆదరణ చూపించారని పేర్కొంది.
అయితే ఎగ్టిట్ పోల్ నిర్వహించిన మిగిలిన సంస్థలేవీ విజయ్‌కు ఈ స్థాయిలో సీట్లు వస్తాయని పేర్కొనలేదు. చాలా సంస్థలు అధికార డీఎంకేయే 120 నుంచి 140 సీట్ల విజయంతో రెండోసారి అధికారం చేపడుతుందని పేర్కొన్నాయి.కాగా, మిగిలిన పోల్ సంస్థల ఫలితాలకు భిన్నంగా యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనాలు కనుక నిజమై విజయ్ కనుక అధికారంలోకి వస్తే తమిళనాడులో కొత్త చరిత్రకు నాంది పలుకుతుందనడంతో సందేహం లేదు.
యాక్సిస్ మై ఇండియా సంస్థ మాత్రమే విజయ్‌కు చెందిన టీవీకే పార్టీకి 98 నుంచి 120 సీట్లు వస్తాయని అంచనా వేయడం సంచలనం సృష్టించింది. దీంతో ఎన్డీఏకు నేతృత్వం వహిస్తున్న ఏఐఏడీఎంకే విజయ్ పార్టీతో చర్చలు జరపాలని భావిస్తున్నది. ఈ పోల్ సర్వే అంచనాలే కనుక వాస్తవరూపం దాలిస్తే విజయ్ పార్టీ రాష్ట్రంలో అధికార ఏర్పాటులో కీలక పాత్ర పోషించనుంది. ఇక్కడ అధికారంలోకి రావడానికి మ్యాజిక్ ఫిగర్ 118 కాగా, ఒక వేళ అన్ని సీట్లు రాకపోయినా, విజయ్ మద్దతు అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడితే ఆయన సహకారంతో తాము అధికారం చేపట్టవచ్చునని, లేకపోతే విజయ్‌కే మద్దతు ఇచ్చి డీఎంకేను గద్దె దించాలని ఏఐఏడీఎంకే భావిస్తున్నది.