అగ్రరాజ్యం అమెరికా అర్ధంతరంగా తమ సైన్యాలను వెనక్కు తీసుకెళ్లిపోవడంతో.. తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్లో రోజుకో కొత్త రూల్ తీసుకొస్తున్నారు. ఇటీవలే అమ్మాయిలకు హైస్కూల్ తలుపులు తెరిచినట్లే తెరిచి, మూసేసిన తాలిబన్ ప్రభుత్వం ఇప్పుడు మరో కఠిన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా గడ్డం పెంచుకోవాలని ఆదేశించింది.
అలాగే విదేశీ వస్త్రాలు ధరించొద్దని, స్థానికంగా ఉండే దుస్తులో వేసుకోవాలని చెప్పింది. ఆఫ్ఘన్లో దొరికే పొడవాటి లూజు చొక్కా, ప్యాంటు వేసుకొని, గడ్డం పెంచుకొని, తలపై టోపీ లేదా తలపాగా పెట్టుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పబ్లిక్ మోరాలిటీ మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
తాజాగే ప్రభుత్వ ఆఫీసుల్లో తాలిబన్ ప్రతినిధులు పెట్రోలింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గడ్డం లేకుండా ఉన్న ఉద్యోగులపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎవరూ షేవింగ్ చేసుకోవద్దని హెచ్చరించారు. తాము నిర్దేశించిన రూల్స్ ఎవరైనా సరే పాటించకపోతే వారిని ఆఫీసుల్లోకి రానివ్వబోమని స్పష్టం చేసింది. ఇదే తప్పును రిపీట్ చేస్తే సదరు వ్యక్తులను ఉద్యోగాల్లోకి తొలగిస్తామని హెచ్చరించింది.