పారిస్, డిసెంబర్ 9: స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ బిలియనీర్, లగ్జరీ ఫ్యాషన్ హౌస్ హెర్మ్స్ వ్యవస్థాపకుడు థైరీ హెర్మ్స్ మనువడు నికోలస్ ప్యూచ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 51 ఏండ్ల మాజీ తోటమాలిని దత్తత తీసుకుని అతనికి 1100 కోట్ల డాలర్ల (రూ.97 వేల కోట్లు) సంపదను అప్పగించాలని నిర్ణయించారు. స్విస్‌కు చెందిన ‘ట్రిబ్యూన్’ వెలువరించిన కథనం ప్రకారం థైరీ హెర్మ్స్కు ఐదవతరం వాడైన 80 ఏండ్ల నికోలస్ ప్యూచ్ అవివాహితుడు, సంతానం లేదు.
వారసత్వంగా సంక్రమించిన హెర్మ్స్లో అతనికి ఐదు నుంచి పది శాతం వాటా ఉంది. దీంతో ఆయన తన మాజీ తోటమాలి (పేరు వెల్లడించ లేదు)ని తన వారసుడిగా దత్తత తీసుకుని అతనికి ఆస్తిని రాయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన న్యాయ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఇప్పటికే నికోలస్ మొరాకో, మర్రకేష్ల్లోని ఆస్తులను, మాంట్రెక్స్, స్విట్జర్లాండ్లలో మిలియన్ డాలర్లు విలువ చేసే విల్లాలను తోటమాలికి అప్పగించినట్టు ట్రిబ్యూన్ వెల్లడించింది.