Heart Problems | డబ్లిన్: మూడు రోజులు సరిగా నిద్రపోకపోయినా గుండెకు హాని జరుగుతుందని స్వీడెన్లోని ఉప్సలా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. గుండె జబ్బులకు నిద్ర లేమి ఎలా కారణమవుతుందో తెలిపారు. ఈ అధ్యయనం కోసం రక్తంలోని ఇన్ఫ్లమేటరీ ప్రొటీన్లను వారు పరిశీలించారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా ఒత్తిడిని అనుభవిస్తున్నప్పుడు శరీరం ఈ ప్రొటీన్లను విడుదల చేస్తుంది.
ఈ ప్రొటీన్లు ఎక్కువ కాలం ఉన్నప్పుడు అవి రక్త నాళాలను దెబ్బ తీసి గుండె వైఫల్యం, గుండె జబ్బులు, గుండె చప్పుడులో అసమతుల్యత వంటి వాటికి కారణం కావొచ్చని పరిశోధకులు తెలుసుకున్నారు. ఈ అధ్యయనంలో 16 మంది యువకులను మూడు రోజుల పాటు సాధారణ నిద్ర సమయం (8.5 గంటలు) నిద్రపోనిచ్చారు. ఆ తర్వాత మూడు రాత్రుల పాటు వారిని ప్రతి రోజూ 4.25 గంటలు మాత్రమే నిద్రించేలా చేశారు.
ఈ రెండు సందర్భాల్లో నిద్రకు ముందు, తర్వాత వారి రక్త నమూనాలను పరిశీలించారు. తక్కువ గంటలు నిద్ర పోయినప్పుడు ఇన్ఫ్లమేటరీ ప్రొటీన్ల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. అదే సమయంలో ఇంటర్‌ల్యూకిన్-6, బీఎన్డీఎఫ్ లాంటి ఆరోగ్యకర ప్రొటీన్ల సంఖ్య తగ్గింది. కేవలం మూడు రాత్రుల పాటు నిద్ర సరిగా లేకపోతే ఆరోగ్యవంతులైన యువకుల రక్తంలో సైతం మార్పులు రావడం పట్ల శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.