Sunita Williams | న్యూయార్క్, మార్చి 16: అంతరిక్షంలోని ఐఎస్ఎస్లో వ్యోమగాములు తేలియాడుతుండటం చూడటానికి మనకు సరదాగా ఉండవచ్చు. కానీ, సుదీర్ఘ కాలం అంతరిక్షంలో ఉండే వ్యోమగాములపై జీరో గ్రావిటీ తీవ్ర ప్రభావం చూపుతుంది. భూమిపైకి తిరిగొచ్చాక తల తిరగడం, వికారం, నడవలేకపోవడం లాంటి అనేక ఇబ్బందులు వారిని చుట్టుముడతాయి. నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో బుధవారం భూమిపైకి తిరిగిరానున్నారు. 8 రోజుల అంతరిక్ష యాత్ర కోసం ఐఎస్ఎస్కు వెళ్లిన విలియమ్స్, విల్మోర్ సాంకేతిక కారణాల వల్ల 9 నెలల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గతంలో పలు మిషన్ల కోసం అంతరిక్షంలో ట్రావెల్ చేసిన ఆస్ట్రోనాట్స్ తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు. నడవలేకపోవడం, చూపు మందగించడం, తల తిరగడం, బేటీ ఫీట్ (అరికాళ్లతోపాటు ఇతర మందపాటి చర్మం సన్నగా, చిన్న పిల్లల చర్మ వలె మారిపోవడం) లాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు తెలిపారు. ‘వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నాక గురుత్వాకర్షణ శక్తికి సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. వారి శ్రేయస్సు దృష్ట్యా మొదట కుర్చీలో కూర్చొబెడతారు’ అని హ్యూస్టన్‌లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పేర్కొంది.
ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వ్యోమగాములకు ఒక్కోసారి కొన్ని వారాల సమయం పట్టవచ్చు. చెవి లోపల ఉండే వెస్టిబ్యులర్ అనే అవయవం మనం నడిచేటప్పుడు బాడీ బ్యాలెన్స్‌గా ఉండేందుకు సహాయపడుతుంది. జీరో గ్రావిటీలో దీని పనితనం మారిపోతుంది. భూమిపైకి తిరిగొచ్చాక స్పేస్ సిక్నెస్ కారణంగా ఇది మెదడును గందరగోళానికి గురిచేస్తుందని జపాన్ స్పేస్ ఏజెన్సీ జాక్సా తెలిపింది.
జీరో గ్రావిటీలో ఉన్నప్పుడు రక్తం సహా ఇతర ద్రవాలన్నీ శరీరం పైభాగంలో ఉండిపోయి ఉబ్బినట్టు కనిపించేలా చేస్తాయి. ప్రతి నెల ఒక శాతం ఎముకల సాంద్రతను కోల్పోతారు. దీని నుంచి బయటపడి నడవాలంటే ట్రెడ్మిల్ సాయంతో వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ కూడా తన కర్తవ్యాన్ని మరిచిపోతుందని, అయితే ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫెక్షన్ను వ్యోమగాములు ఎదుర్కొనలేదని యూరోపియన్ ఏజెన్సీకి చెందిన సెర్జి వెల్లడించారు.
వాషింగ్టన్: ఎంతోకాలంగా వాయదా పడుతూ వస్తున్న నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్ల తిరుగు ప్రయాణం ఎట్టకేలకు ఖరారైంది. గత 9 నెలలుగా ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన వీరిద్దరి తిరుగు ప్రయాణం బుధవారం ఖరారైనట్టు తెలిసింది. ఐఎస్ఎస్కు చేరుకున్న స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్, అనుసంధానం (డాకింగ్) ప్రక్రియను ఆదివారం ఉదయం విజయవంతంగా పూర్తిచేసినట్టు ‘నాసా’ వెల్లడించింది. కొత్త వ్యోమగాములకు ఐఎస్ఎస్ వ్యోమగాములు స్వాగతం పలికారు.
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్ అనుకోని సాంకేతిక కారణాల వల్ల తొమ్మిది నెలల పాటు ఐఎస్ఎస్లో చిక్కుకుపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో అన్ని రోజులు ఉన్నందుకు వారికి లభించే జీతభత్యాలపై చర్చ నడుస్తున్నది. విశ్రాంత నాసా వ్యోమగామి కోల్మాన్ ప్రకారం వ్యోమగాముల ప్రత్యేక అదనపు పని సమయానికి జీతం ఉండదు. వ్యోమగాములు ఫెడరల్ ఉద్యోగులు కావడంతో వాళ్లు అంతరిక్షంలో ఉన్నా వారికి రెగ్యులర్ జీతాలనే చెల్లిస్తారు.
ఇందులో ఐఎస్ఎస్లో వ్యోమగాముల ఆహార, నివాస ఖర్చులు కలిపి ఉంటాయి. అయితే రోదసిలో వారికి జరిగే అనుకోని ఘటనలకు గాను రోజుకు రూ.347(4 డాలర్లు) ైస్టెఫండ్గా చెల్లిస్తారు. వ్యోమగాములు జి-15 ప్రభుత్వ ఉద్యోగుల విభాగం కింద వార్షిక జీతం రూ.81 లక్షల నుంచి రూ.1.41 కోట్లు పొందుతారు. ఐఎస్ఎస్లో అదనంగా ఉన్నందుకు సునీత, విల్మోర్ సుమారు రూ.81 లక్షల నుంచి రూ.1.05 కోట్ల జీతం పొందవచ్చు.