CT Scan | ఈస్ట్ ఆంగ్లియా (యూకే): మానవ శరీరంలో క్యాన్సర్‌ను కనుగొనడానికి సీటీ స్కాన్ నిర్వహిస్తారు. కానీ సీటీ స్కాన్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉన్న వారికి సైతం క్యాన్సర్ వచ్చే ప్రమాదమున్నదని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆధునిక వైద్య పరిజ్ఞానంలో సీటీ స్కాన్ అనేది ఎంతో కీలకంగా మారిన సంగతి తెలిసిందే. సీటీ స్కాన్ చేయడం ద్వారా శరీరంలోని రుగ్మతలను వేగంగా, సమగ్రంగా తెలుసుకొనే అవకాశం కలుగుతుంది. డాక్టర్లకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. అయితే ఈ పరిజ్ఞానంపై అధికంగా ఆధారపడటం ప్రమాదకరం కావచ్చని ఈ అధ్యయనం హెచ్చరించింది. జామా ఇంటర్నల్ మెడిసిన్ పత్రికలో ఈ వివరాలు ప్రచురించారు.
అమెరికాలో 2023లో నిర్వహించిన సీటీ స్కాన్ల కారణంగా లక్ష క్యాన్సర్ కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నదని ఆ అధ్యయనం హెచ్చరించింది. సీటీ స్కానింగ్‌ల రేటు ఇప్పుడున్న రీతిలోనే కొనసాగితే.. కేవలం సీటీ స్కాన్ల కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఐదు శాతం క్యాన్సర్ కేసులు పెరగవచ్చని తెలిపింది. ఇది ఆందోళనకరమని పేర్కొంది. అమెరికాలో గత పదేండ్ల కాలంలో సీటీ స్కాన్ల సంఖ్య 30 శాతం పెరిగిందని తెలిపింది. ఒకేఒక్కసారి సీటీ స్కాన్ చేయడం వల్ల ముప్పు చాలా తక్కువగా ఉండవచ్చు తప్ప అసలు లేకుండా పోయే అవకాశం లేదని పేర్కొంది. రోగి ఎంత తక్కువ వయస్సువారైతే ముప్పు అంత అధికంగా ఉంటుందని తెలిపింది. సాధారణంగా వైద్యులు చిన్న పిల్లలకు సీటీ స్కాన్‌ను సిఫారసు చేయరు. 90 శాతం వరకు సీటీ స్కాన్లు వయోజనులపైనే జరుగుతున్న నేపథ్యంలో వారికే ముప్పు అధికంగా ఉంటుందని తెలిపింది.
సీటీ స్కాన్ వల్ల ఊపిరితిత్తులు, పెద్ద పేగు, మూత్రాశయానికి క్యాన్సర్ సోకవచ్చని, లుకేమియా రావచ్చని, మహిళలకు రొమ్ము క్యాన్సర్ ముప్పు ఉంటుందని ఆ అధ్యయనం వెల్లడించింది. ఇదే అంశంపై 2009లో జరిగిన ఒక విశేష్లణలో సీటీ స్కాన్ల వల్ల 29 వేల క్యాన్సర్ కేసులు నమోదు కావచ్చని అంచనా వేశారు. కానీ తాజా అంచనా అంతకు మూడు రెట్లు ఉండటం ఆందోళనకరం. పరిస్థితి ఇలాగే కొనసాగితే మద్యం, అధిక బరువు వల్ల ఎదురయ్యే ముప్పుతో సమానంగా సీటీ స్కాన్ బాధితులు కూడా ఉండవచ్చని అంచనా వేసింది. శరీరంలోని ఏ భాగాన్ని స్కాన్ చేసినా ఒకే విధమైన ముప్పు ఉండకపోవచ్చునని, ఉదరం, కటి భాగాన్ని సీటీ స్కాన్ చేయడం వల్ల మాత్రం భవిష్యత్తులో క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఏడాది లోపు పిల్లల తలను సీటీ స్కాన్ చేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది.
సీటీ స్కాన్ వల్ల క్యాన్సర్ ముప్పు ఉన్నప్పటికీ ప్రాణాలు కాపాడటంలో ఆ పరిజ్ఞానం కీలకమని వైద్యులు పేర్కొంటున్నారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రోగ నిర్ధారణకు సీటీ స్కాన్ దోహదపడుతుందని అంటున్నారు. తాజా హెచ్చరికల నేపథ్యంలో ఇకపై అవసరమైతే తప్ప వైద్యులు సీటీ స్కాన్‌ను సిఫారసు చేయకపోవడం మంచిదని ఆ అధ్యయనం సూచించింది. మరోవైపు సీటీ స్కాన్లు క్యాన్సర్ కారకాలని ఈ అధ్యయనం రుజువు చేయలేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అధ్యయనంలోని అంచనాలన్నీ ‘రిస్క్ మాడల్స్’పై ఆధారపడినవి తప్ప ప్రత్యక్ష ఆధారాలు కాదని అంటున్నారు. రేడియేషన్ వల్ల క్యాన్సర్ రావచ్చన్నది కొత్త ఆవిష్కరణ కాదని, ఆ ముప్పు మొదటి నుంచీ ఉన్నదని పేర్కొన్నారు.