Trump-Xi summit : ప్రపంచంలోనే రెండు అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా అధ్యక్షుల భేటీపై అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అందులోనూ ఇరాన్‌తో అమెరికా యుద్ధం చేస్తున్న వేళ.. ఇరు దేశాల అధ్యక్షులైన డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని బీజింగ్‌లో గురువారం ట్రంప్, జిన్‌పింగ్ భేటీ అయ్యి కీలక అంశాలపై చర్చించారు.
ఇరు దేశాధినేతల మధ్య కీలక వ్యాపార, వాణిజ్య, రక్షణ, సాంకేతికత సహా పలు అంతర్జాతీయ అంశాలపై చర్చలు, ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా అమెరికా కంపెనీలను చైనాలో విస్తరించేందుకు గల అవకాశాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే, అమెరికాలోనూ చైనా కంపెనీలకు మరింత భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు. ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఇరాన్‌ను అణుదేశంగా ఉండనివ్వకూడదనే అంశంలో ఇరువురు నేతలూ ఏకాభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాలని కూడా అమెరికాకు చైనా సూచించింది.
అందుకే హార్ముజ్‌ను ఓపెన్ చేసి అందుబాటులో ఉంచుతామని జిన్‌పింగ్‌కు ట్రంప్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా చమురు రవాణాకు ఆటంకం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలును పెంచేందుకు చైనా అంగీకరించింది. అలాగే, హార్ముజ్ వద్ద ఎలాంటి సైనిక కదలికలకు అంగీకరించేది లేదని చైనా తెలిపింది. దీంతోపాటు హార్ముజ్ నుంచి వచ్చే నౌకలపై టోల్ వసూలు చేయాలనే ప్రతిపాదనను కూడా చైనా వ్యతిరేకించింది. అమెరికా నుంచి మరింత చమురు కొనేందుకు కూడా చైనా అంగీకరించింది. దీని ద్వారా హార్ముజ్ మార్గం నుంచి చమురు దిగుమతి చేసుకునే అవకాశం తప్పుతుందని చైనా అభిప్రాయం.
మరోవైపు తైవాన్ అంశంలో జోక్యం చేసుకోకూడదని అమెరికాకు చైనా హెచ్చరించింది. అయితే, ట్రంప్ పర్యటన, తాజా చర్చలు సానుకూల వాతావరణంలో సాగుతున్నట్లు, ఇరు దేశాల మధ్య కొత్త ఒప్పందానికి నాంది పలుకుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.