Strait Of Hormuz : హార్ముజ్ జలసంధి మూసివేయడంతో అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో ఈ జలసంధిని తెరవాలని ఇరాన్‌కు విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ మిత్రదేశాలకు మాత్రమే ఈ జలసంధి నుంచి నౌకల రవాణాకు అనుమతులు మంజూరు చేస్తామని ఇరాన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మిత్రదేశాలు, శతృదేశాల జాబితాను విడుదల చేసింది. ప్రధానంగా ఐదు దేశాల్ని మిత్రదేశాలుగా పేర్కొంది. వాటిలో ఇండియా కూడా ఉండటం విశేషం.
ఇండియా, చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాక్ దేశాల్ని మిత్ర దేశాలుగా పేర్కొంది. ఈ దేశాలకు చెందిన నౌకల్ని హార్ముజ్ జలసంధి గుండా అనుమతిస్తామని ఇరాన్ తెలిపింది. ఇప్పటికే రెండు నౌకలు బయల్దేరాయని వెల్లడించింది. అలాగే, బంగ్లాదేశ్ నౌకల్ని కూడా అనుమతిస్తామని చెప్పింది. ఈ దేశాలు ఇప్పటికే తమతో మాట్లాడాయని, తమతో సమన్వయం చేసుకుంటాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అన్నారు. భవిష్యత్తులోనూ ఈ దేశాలకు సహకారం అందిస్తామని, యుద్దం ముగిసిన తర్వాత కూడా సహాయం కొనసాగుతుందని ఆయన చెప్పారు. మిత్రదేశాలతోపాటు తాము అనుమతించేది లేని శతృదేశాల జాబితాను కూడా ఇరాన్ ప్రకటించింది. ఈ జాబితాలో అమెరికా, ఇజ్రాయెల్, యుద్ధంతో సంబంధం ఉన్న కొన్ని గల్ఫ్ దేశాలు, యుద్ధంలో కీలక పాత్ర పోషించిన దేశాలతో సంబంధాలు కలిగి ఉన్న కూటమి దేశాలున్నాయి. ఈ దేశాలకు చెందిన నౌకల్ని అనుమతించబోమని అరాగ్చి స్పష్టం చేశారు.
ప్రస్తుతం తమ దేశం యుద్ధం చేస్తోందని, యుద్ధం సమయంలో శతృదేశాల నౌకల్ని అనుమతించబోమని, అయితే, ఇతరులకు మాత్రం అనుమతి ఉంటుందన్నారు. మిత్రదేశాల నౌకలు ఈ మార్గం గుండా వెళ్లాలన్నా తగిన నిబంధనలు పాటించాల్సిందే. పూర్తి సమన్వయం తర్వాతే నౌకల్ని అనుమతిస్తారు. ఇప్పటికే కొన్ని నౌకలకు అనుమతి లభించింది. ఈ విధానం సంక్షోభం తర్వాత కూడా కొనసాగుతుంది. మిత్రదేశాలకు ఎప్పటికీ హార్ముజ్ జలసంధి అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ మార్గంలో ప్రయాణించే నౌకలపై ఇకనుంచి టోల్ వసూలు చేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇప్పటికే కొన్ని నౌకలు టోల్ చెల్లించినట్లు సమాచారం.