Israel | ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇజ్రాయెల్ అధికారులు, హోం ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది.
ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో భారత పౌరులు రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన 24 గంటల హెల్ప్‌లైన్ నంబర్లు +972-54-7520711, +972-54-3278392ను సంప్రదించాలని సూచించింది. లేదంటే consl.telaviv@mea.gov.in మెయిల్ ద్వారా సంప్రదించాలని పేర్కొంది.
మరోవైపు ఇరాన్లో రోజురోజుకీ పరిస్థితులు క్షీణిస్తున్నాయి. పైగా ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలకు దిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, టూరిస్ట్‌లు, వ్యాపారవేత్తలు ఆ దేశాన్ని విడిచిపెట్టాలని భారత్ సూచించింది. అలాగే స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఇండియా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ ఇవాళే ప్రారంభం కానున్నట్లు సమాచారం.