Bangladesh Govt : షేక్ హసీనా (Sheik Hassina) ప్రధాని పదవి నుంచి వైదొలగడానికి కారణమైన విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ (Sharif Osman Bin Hadi) మృతితో బంగ్లాదేశ్ (Bangladesh) లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతలపై మహమ్మద్ యూనస్ (Mohammad Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది. ఆందోళనకారులు సంయమనం పాటించాలని, హింసకు దూరంగా ఉండాలని కోరింది. అదేవిధంగా జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పింది.
ది డైలీ స్టార్, న్యూ ఏజ్, ప్రోథోమ్ అలో తదితర మీడియా సంస్థల కార్యాలయాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆపై నిప్పంటించారు. దాంతో కొందరు జర్నలిస్టులు అగ్నికీలల్లో చిక్కుకుపోయారు. తర్వాత వారిని రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. దుండగులతో మాట్లాడేందుకు ప్రయత్నించిన న్యూ ఏజ్ పత్రిక ఎడిటర్ నూరుల్ కబీర్‌పై దాడి జరిగింది. దీంతో బంగ్లాదేశ్‌లో ప్రధాన పత్రికలు శుక్రవారం తమ కార్యకలాపాలను సస్పెండ్ చేశాయి.
ది డైలీ స్టార్, న్యూ ఏజ్, ప్రోథోమ్ అలో జర్నలిస్టులకు తాము అండగా నిలుస్తామని, మీరు ఎదుర్కొన్న హింసపై తీవ్రంగా చింతిస్తున్నామని, ఈ హింసను ఎదుర్కొనే క్రమంలో జర్నలిస్టులు చూపిన ధైర్యాన్ని ఈ దేశం చూసిందని, వారికి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నామని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొన్నది. కాగా బంగ్లా ఘర్షణల్లో ఒక మైనార్టీ వ్యక్తి మూక హత్యకు గురయ్యాడు. ఈ ఘటనను ప్రభుత్వం ఖండించింది.