కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స (Gotabya Rajapaksa) దేశం విడిచి పారిపోయారు. అధ్యక్షపదవికి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన బుధవారం తెల్లవారుజామున మాల్దీవులకు పరారయ్యారు. భార్య సహా ఇద్దరు బాడీగార్డ్స్‌తో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మేల్‌కు చెక్కేశారు. అక్కడి ప్రభుత్వం వెలనా విమానాశ్రయంలో రాజపక్సకు స్వాగతం పలికింది.
దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల ఆందోళనలు ఉధృతం చేశారు. ఈ క్రమంలో అధ్యక్షభవనంలోకి చొచ్చుకెళ్లారు. దీంతో ఆయన ఈనెల 9న అధికార నివాసం నుంచి పారియారు. అయితే అప్పటినుంచి గొటబయ ఎక్కడ ఉన్నారనే విషయం తెలియకుండా పోయింది. కాగా, సోమవారం కొలంబో విమానాశ్రయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
గొటబయ, ఆయన భార్య, కుటుంబసభ్యులకు చెందిన దాదాపు 15 పాస్‌పోర్టులను ఆయన సన్నిహితులు ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. వీటికి వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. అయితే నిబంధనల ప్రకారం ఎవరైనా దేశం విడిచి వెళ్లాలంటే పాస్పోర్టుతో స్వయంగా హాజరుకావాలి. కానీ గొటబయ, ఆయన కుటుంబసభ్యులు హాజరు కానందునా ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరస్కరించారు.
గొటబయ సోదరుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి బసిల్ రాజపక్స కూడా దేశాన్ని విడిచి పారిపోవడానికి మంగళవారం ప్రయత్నించాడు. దీంతో ప్రజలతోపాటు ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్న విషయం తెలిసిందే.