Sri Lanka : ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికాకు శ్రీలంక షాకిచ్చింది. తమ దేశానికి చెందిన రెండు యుద్ధ విమానాల్ని ల్యాండ్ చేసేందుకు అంగీకరించాలంటూ అమెరికా చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. తాము యుద్ధ సమయంలో తటస్థ వైఖరి అవలంభిస్తామని అమెరికాకు శ్రీలంక స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే శుక్రవారం అక్కడి పార్లమెంట్లో దీనిపై ప్రకటన చేశారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలు ఆఫ్రికాలోని డిబౌటి పట్టణంలో ఉన్నాయి.
ఈ విమానాలు ఒక్కో దాంట్లో ఎనిమిది యాంటీ షిప్ మిస్సైల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న వేళ వాటిని వ్యూహాత్మకంగా వాడేందుకు శ్రీలంకకు తీసుకురావాలనుకుంది. ఇందుకోసం ఆయుధాలతో కూడిన ఈ విమానాల్ని శ్రీలంకలోని మట్టాలా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేస్తామని, ఇందుకు అనుమతించాలని అమెరికా కోరింది. ఈ నెల ప్రారంభంలో ఈ అంశంపై శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకేతో అమెరికాకు చెందిన సౌత్, సెంట్రల్ ఆసియా ప్రతినిధి సెర్గియో గోర్ చర్చలు జరిపారు. ఈ నెల 4న శ్రీలంకలో విమానాల్ని ల్యాండ్ చేసేందుకు అనుమతించాలని కోరారు. కానీ, దీనికి అధ్యక్షుడు దిస్స నాయకే నో చెప్పారు. తాము ఈ యుద్ధ సమయంలో తటస్థంగానే ఉండదలిచామని దిస్సనాయకే తెలిపారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం సమయంలో ఎంత ఒత్తిడి ఎదురైనా తటస్థంగానే ఉన్నామని, ఈ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
అమెరికాతో చర్చల సందర్భంగా సముద్ర మార్గాల రక్షణ, పోర్టుల భద్రత, వ్యాపార, వాణిజ్య రంగాల్లో సహకారం వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు దిస్సనాయకె తెలిపారు. ఇక, ఈ విమానాలు ల్యాండ్ అవ్వాల్సిన మార్చి 4న ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికన్ టోర్పిడోడ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 84 మంది మరణించారు. 32 మందిని శ్రీలంక నేవీ రక్షించింది. ఈ ఘటన శ్రీలంక సముద్ర జలాల సరిహద్దులోనే జరిగింది. మరోవైపు ఇరాన్ యుద్ధం ప్రభావం శ్రీలంకపై కూడా పడింది. ముఖ్యంగా చమురుకు ఇబ్బందులు పడుతోంది. అందుకే అక్కడ వారానికి 4 రోజులే పనిదినాలుగా ప్రకటించింది. ఇప్పటివరకు శ్రీలంకలో ఐదు రోజులే పని దినాలుగా ఉండేవి. శని, ఆదివారాల్లో సెలవులుండేవి. కానీ, ఇప్పుడు బుధవారం కూడా సెలవు దినంగా ప్రకటించింది.