South Africa : దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో 12 మంది మరణించారు. ఈ ఘటన తూర్పు జోహన్నెస్‌బర్గ్‌లోని, క్లీవ్‌ల్యాండ్‌లో ఉన్న జంపర్స్ ఇన్ఫార్మల్ సెటిల్మెంట్లో మంగళవారం సాయంత్రం జరిగింది.
ఈ సెటిల్మెంట్ ఏరియాలోకి పది మంది వరకు దుండగులు టొయోటా వాహనంలో వచ్చారు. ఆయుధాలు కలిగిన ఈ దుండగులు అక్కడ ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ సెటిల్మెంట్ పరిధిలోని రెండు యాక్సెస్ పాయింట్లను ఎంచుకుని, అక్కడి నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది గాయపడ్డారు. కాల్పుల అనంతరం దుండగులు అక్కడినుంచి పారిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ కాల్పులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
10 మంది నిందితుల కోసం వెతుకుతున్నారు. ఇంకా నిందితుల్ని పట్టుకోలేదు. ఇదే సమయంలో ఈ కాల్పులకు గల కారణాలు కూడా తెలియలేదు. నిందితులు ఇంత భారీ స్థాయిలో ఎందుకు కాల్పలు జరిపారు అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవలి కాలంలో దక్షిణాఫ్రికాలో హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.