Solar Power Plant | బెర్న్, అక్టోబర్ 7 : సౌర విద్యుత్తు ఉత్పత్తి కోసం స్విట్జర్లాండ్ ప్రభుత్వం విప్లవాత్మక ఆలోచన చేసింది. రైల్వే ట్రాక్‌పై తొలిసారి రిమూవబుల్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు ఆ దేశ రవాణా శాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. స్విట్జర్లాండ్‌లో ఇలాంటి ప్రాజెక్టుకు ఆమోదం తెలపడం ఇదే తొలిసారి. దీంతో అక్కడ వినూత్న తరహాలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు మార్గం సుగమమైంది.
ఈ ప్రాజెక్టును స్విస్ స్టార్టప్ ‘సన్-వేస్’ అభివృద్ధి చేస్తున్నది. న్యూచాటెల్ ప్రజా రవాణా సంస్థ ‘ట్రాన్స్ ఎన్’ ఆధ్వర్యంలోని 221 రైల్వే వ్యవస్థలో 100 మీటర్ల లీనియర్ సెక్షన్‌పై వచ్చే ఏడాది ఈ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించాలని ‘సన్-వేస్’ భావిస్తున్నది. 6,21,800 యూరోల (దాదాపు రూ.5.74 కోట్ల) వ్యయంతో ప్రయోగాత్మంగా నిర్మించే ఈ ప్లాంట్‌లో 380 వాట్ల చొప్పున ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 48 సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 18 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్తును స్థానిక గ్రిడ్‌కు అందజేయనున్నారు. స్థానిక విద్యుత్తు పంపిణీ సంస్థ ‘విటెయోస్’తోపాటు రైల్వే ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్లలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన ‘డీజీ-రైల్’ సంస్థ సహకారంతో ‘సన్-వేస్’ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నది.