కొలంబో: శ్రీలంకలో రైలు ఢీకొని ఆరు ఏనుగులు(Elephants) మృతిచెందాయి. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. రైలులోని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అయితే ఏనుగుల గుంపున ఢీకొన్న రైలు పట్టాలు తప్పింది. కొలంబోకు తూర్పున ఉన్న హబరానాలోని వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ విషాద ఘటన జరిగింది. గాయపడ్డ రెండు ఏనుగులకు చికిత్స అందిస్తున్నారు.
శ్రీలంకలో గత ఏడాది ఏనుగుల వల్ల 170 మంది మృతిచెందారు. అయితే వేర్వేరు ఘటనల్లో 500 ఏనుగులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. లంకలో సగటున ప్రతి ఏడాది సుమారు 20 ఏనుగులు రైలు ఢీకొనడం వల్ల చనిపోతున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అడవుల నరికివేత వల్ల జంతువులు మానవ ప్రదేశాల్లోకి వస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో రాత్రి పూట రైళ్లను నెమ్మదిగా నడపాలని, హారన్లు ఇవ్వాలని డ్రైవర్లకు ఆదేశాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు.
శ్రీలంకలో సుమారు ఏడు వేల ఏనుగులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బౌద్ద మతస్తులు ఆ జంతువుల్ని పవిత్రంగా భావిస్తారు.ఏనుగుల్ని చంపితే అక్కడ జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు.