Bangladesh : ఇరాన్ (Iran) పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో ఇంధన కొరత నెలకొన్నది. ఈ ఇంధన కొరతను అధిగమించేందుకు బంగ్లాదేశ్ (Bangladesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో దుకాణాలు, షాపింగ్ మాల్స్‌ను సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పని గంటలను సైతం ఒక గంట తగ్గించింది. ఇక మీదట సాయంత్రం ఐదు గంటలకు బదులు 4 గంటలకే అన్ని కార్యాలయాలను మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నది.
అదేవిధంగా బ్యాంకింగ్ లావాదేవీలను సైతం ఉదంయ 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత బ్యాంకులు కూడా మూతపడనున్నాయి. హోటళ్లు, ఫార్మసీలు, అత్యవసర సేవలు, నిత్యావసర వస్తు మార్కెట్లకు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలో జరిగిన బంగ్లా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, బంగ్లాదేశ్ విజ్ఞప్తి మేరకు భారత్ 5 వేల టన్నుల డీజిల్‌ను ఆ దేశానికి సరఫరా చేసింది.
రాబోయే నాలుగు నెలల్లో మరో ఐదు వేల టన్నుల డీజిల్‌ను సరఫరా చేయాలని భారత ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ సర్కారు కోరింది. ఈ విన్నపాన్ని పరిశీలిస్తున్నట్టు భారత విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైస్వాల్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై భీకర దాడులు చేసి ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చాయి. అప్పటి నుంచి మధ్యప్రాచ్యం భగ్గుమంటోంది.