వాషింగ్టన్, సెప్టెంబర్ 2: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహితంగా మెలగడం సిగ్గుచేటని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్యానించారు. అమెరికాతో సంబంధాలు కొనసాగించాలని ఆయన భారత్‌కు సూచించారు. జీ జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్ పక్కన మోదీ నిలబడడం సిగ్గుచేటు. మోదీ ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. కాని రష్యాకు బదులుగా తాను అమెరికాతోనే ఉండాలని ఆయన అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని సోమవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవారో తెలిపారు.
చైనాలోని టియాంజిన్‌లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సుకు హాజరైన మోదీ.. జీ జిన్‌పింగ్, పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా వారు ముగ్గురూ తీసుకున్న ఫొటోపై నవారో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్సీఓ సదస్సును ఓ నాటకంగా నవారో అభివర్ణించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ద్వారా భారతీయ బ్రాహ్మణులు(బోస్టన్ బ్రాహ్మణులను సంపన్న వ్యాపారులుగా అమెరికాలో వ్యవహరిస్తారు) లబ్ధిపొందుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.