షాంఘై, ఏప్రిల్ 8: ఒక చిన్న బ్యాటరీని శరీరంలోకి పంపించి రొమ్ము క్యాన్సర్కు చికిత్స చేసే కొత్త విధానాన్ని చైనాలోని ఫుడాన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. క్యాన్సర్ కణతి కణజాలం చుట్టూ ఉప్పు నీటిని పంపించి అందులో చిన్నపాటి విద్యుత్తును సృష్టించడం ద్వారా ఈ బ్యాటరీ పని చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ బ్యాటరీ వల్ల క్యాన్సర్ చికిత్సకు ఇచ్చే ఔషధాలు సమర్థంగా పని చేసి కణతి తొలిగిపోతుందని చెప్తున్నారు. దీనిని మొదట నాలుగు ఎలుకలపై ప్రయోగించారు. కేవలం రెండు వారాల్లో ఆ ఎలుకల్లో క్యాన్సర్ కణతులు 90 శాతం తొలిగిపోయాయని పేర్కొన్నారు. మనుషుల్లో కూడా ఇదే రకమైన ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిన్న బ్యాటరీ 500 గంటల పాటు పని చేస్తుందని తెలిపారు. ప్రస్తుతానికి మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేయడానికి అనుమతి రాలేదని, రాగానే ట్రయల్స్ మొదలుపెడతామని చెప్పారు.