Bacteria | హూస్టన్ (అమెరికా), మే 26: జీవ సాంకేతిక శాస్ర్తాన్ని, శక్తి వ్యవస్థలను మార్చేయగలిగే ఆశ్చర్యకరమైన మనుగడ వ్యూహాన్ని పరిశోధకులు కనుగొన్నారు. విచిత్రంగా కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఆక్సిజన్‌కు బదులుగా విద్యుత్తును పీల్చుకుని జీవిస్తాయని హ్యూస్టన్‌లోని రైస్ యూనివర్సిటీ జీవశాస్త్రవేత్త కరోలిన్ అజో-ఫ్రాంక్లిన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం గుర్తించింది.
సహజ ప్రక్రియ ద్వారా ఆ బ్యాక్టీరియాలు ఎలక్ట్రాన్లను తమ పరిసరాల్లోకి నెట్టి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయని, తద్వారా ఆ విద్యుత్తునే శ్వాసించి మనుగడ సాగిస్తాయని ఆ బృందం తేల్చింది. క్లీన్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ రంగాల్లో కొత్త పరిణామాలకు దోహదపడే ఈ పరిశోధన వివరాలు ‘సెల్’లో ప్రచురితమయ్యాయి. జీవశాస్ర్తాన్ని, విద్యుత్తు రసాయన శాస్త్రంతో విలీనం చేసి శ్వాసక్రియను కొనసాగించగలిగే ఈ సూక్ష్మజీవుల ప్రత్యేక సామర్థ్యాన్ని ఉపయోగించుకుని భవిష్యత్ సాంకేతికతలకు పునాది వేసేందుకు వీలుంటుందని పరిశోధకులు చెప్తున్నారు.