Donald Trump : ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముదురుతోంది. ఇప్పుడు ఈ యుద్ధంలోకి యెమెన్‌లోని ఉగ్రవాదులు హౌతీలు కూడా ఎంటర్ అయ్యారు. వీరు ప్రధానంగా ఎర్ర సముద్రంపై, సౌదీపై దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో యెమెన్‌లోని హౌతీలపై దాడులు చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) కోరారు. ఈ మేరకు ట్రంప్‌నకు సౌదీ రాజు రెండుసార్లు ఫోన్ చేసిన కోరినట్లు తెలుస్తోంది. హౌతీలు.. యెమెన్‌లో ఉన్న ఉగ్రవాదులు. అక్కడి ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేస్తుంటారు.
వీరికి ఇరాన్ మద్దతు ఇస్తుంది. అంటే, వీరికి అవసరమైన ఆర్థిక వనరులు, ఆయుధాలు వంటివి ఇరాన్ సమకూరుస్తుంది. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తుండటంతో హౌతీలు ఇరాన్‌కు మద్దతుగా రంగంలోకి దిగారు. సౌదీపై దాడులు చేస్తున్నారు. అలాగే, సౌదీ చమురు నౌకలు ప్రయాణించే ఎర్ర సముద్రంలోని చెక్ పాయింట్‌ను హౌతీలు బ్లాక్ చేశారు. దీంతో హౌతీలపై దాడి చేయాల్సిందిగా సౌదీ రాజు ఎంబీఎస్.. ట్రంప్‌ను కోరారు. దీనికి ట్రంప్ నుంచి సరైన స్పందన రాలేదని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం యెమెన్‌లో అంతర్యుద్ధం కొనసాగుతోంది.
అంటే, అక్కడి ప్రభుత్వ సైన్యానికి, హౌతీ ఉగ్రవాదులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాము నేరుగా హౌతీలపై దాడి చేయలేమని అమెరికా తేల్చిచెప్పింది. వారిపై ప్రత్యక్ష దాడులకు దిగబోమని, అలాంటి ప్రణాళికలు లేవని సౌదీ రాజుకు అమెరికా వివరించింది. సౌదీ రక్షణ బాధ్యత అమెరికానే చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. సౌదీలో అమెరికా ఆర్మీ బేస్‌లున్నాయి. అమెరికాకు చెందిన ఆర్మీతోపాటు వైమానిక దళానికి సౌదీ ఆశ్రయం ఇస్తుంటుంది. ఇక్కడి నుంచే అమెరికా దాడులు చేస్తుంది. ఆర్మీ బేస్‌లు ఏర్పాటు చేసుకోనిచ్చినందుకుగాను.. సౌదీని రక్షించాల్సిన బాధ్యత అమెరికాది.
అందుకే, తమపై దాడికి దిగిన హౌతీలపై దాడి చేయాలని అమెరికాను సౌదీ కోరింది. సౌదీ అరేబియాకు, హౌతీలకు మధ్య కొంతకాలంగా ఘర్షణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారి బ్రాడ్ కూపర్.. రియాద్ వెళ్లి చర్చించినట్లు కూడా సమాచారం. అయితే, ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.