Alexei Navalny | రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ (47) జైలులో కన్నుమూశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు, అధికార అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన అలెక్సీ నావల్నీ శుక్రవారం వాకింగ్ తర్వాత అస్వస్థతకు గురయ్యారు. స్పృహ కోల్పోవడంతో ఆయనకు వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని రష్యా ప్రిజన్ సర్వీస్ `రష్యా పెంటినిషయరీ సర్వీస్ ఓ ప్రకటనలో తెలిపింది. నావల్నీ మృతి వార్తను అధ్యక్షుడు పుతిన్‌కు తెలిపారని, తదుపరి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రిజన్ సర్వీస్ చర్యలు చేపట్టిందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ తెలిపారు. రష్యా అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో నావల్నీ మరణం చర్చానీయాంశంగా మారింది.
నావల్నీ అధికార ప్రతినిధి కిరా యార్మెష్ `ఎక్స్ (మాజీ ట్విట్టర్)` వేదికగా స్పందిస్తూ.. నావల్నీ మరణం గురించి ఆయన రాజకీయ టీం ధృవీకరించలేదని పేర్కొన్నారు. తీవ్రవాద చర్యలకు పాల్పడ్డారన్న అభియోగంపై నావల్నీకి రష్యా ప్రభుత్వం 19 ఏండ్ల జైలుశిక్ష విధించింది. గత డిసెంబర్లో మధ్య రష్యాలోని జైలు నుంచి ఆర్కిటిక్ సర్కిల్లోని అత్యున్నత భద్రత గత ప్రత్యేక జైలుకు నావల్నీని తరలించారు.