మాస్కో: సుమారు 50 ఏండ్ల తర్వాత రష్యా చేపట్టిన మూన్ మిషన్ ఫెయిల్ అయ్యింది. అది పంపిన లూనా-25 ప్రోబ్ చంద్రుడిపై కూలిపోయింది (Luna-25 Probe Crashes). తమ అంతరిక్ష నౌక చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ ఆదివారం తెలిపింది. శనివారం లూనా-25తో కమ్యూనికేషన్ తెగిపోయినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ల్యాండర్ నియంత్రణ కోల్పోవడంతో చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టినట్టు వెల్లడించింది.
Russia’s Luna 25 Spacecraft
కాగా, ఆగస్ట్ 11న రష్యా ప్రయోగించిన లూనా-25 రెండు రోజుల కిందట చంద్రుడి వద్దకు చేరుకున్నది. అయితే ఆ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. శనివారం చేపట్టిన వేగం తగ్గింపు విన్యాసం సందర్భంగా సాంకేతిక లోపం తలెత్తినట్టు రోస్కాస్మోస్ వెల్లడించింది. ఆటోమేటిక్ స్టేషన్లో అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, దీంతో వేగం తగ్గింపు విన్యాసం చేసేందుకు వీలు కాలేదని శనివారం తెలిపింది.
అయితే లూనా-25 కూలిపోయిందని, చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉపరితలాన్ని ఢీకొట్టిందని రోస్కాస్మోస్ ఆదివారం వెల్లడించింది. మరోవైపు భారత్ పంపిన చంద్రయాన్-3 ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణ ధృవం వద్ద సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో మరో రెండు రోజుల్లో ప్రయత్నించనున్నది.