మాస్కో, మే 25: ఒక వైపు ఖైదీల మార్పిడి జరుగుతుండగానే, మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. రాజధాని కీవ్‌తో సహా పలు నగరాలపై భారీగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా 13 మంది మరణించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన అతిపెద్ద వైమానిక దాడి ఇదే. రష్యా దళాలు 367 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించాయని ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. వీటిలో 266 డ్రోన్లు, 45 క్షిపణులను కూల్చివేశామని తెలిపింది. కీవ్, ఖార్కీవ్, మైకోలైవ్, టెర్నో పిల్, ఖ్మెల్నిట్సీ నగరాలపై ఈ దాడులు జరిగినట్టు పేర్కొన్నది.
వారం రోజలు వ్యవధిలో రష్యా రెండోసారి భీకర దాడికి పాల్పడినా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా విమర్శించారు. వెంటనే రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. కాగా, మాస్కోపై దాడికి ప్రయత్నించిన 95 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామని, 12 డ్రోన్లను అడ్డుకున్నామని రష్యా ప్రకటించింది. 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఒత్తిడి తెస్తున్న క్రమంలో ఈ దాడులు జరిగాయి. ఈ హింసాత్మక ఘటనల మధ్యనే రెండు దేశాలు ఒక్కొక్కటీ వెయ్యి మంది ఖైదీలను మార్పిడి చేసుకున్నాయి.