United Nations | జెనీవా, మార్చి 14: ఉక్రెయిన్‌తో యుద్ధం సాగిస్తున్న రష్యా బలవంతపు అదృశ్యాలు, చిత్రహింసలు వంటి అమానుష నేరాలకు పాల్పడినట్టు ఐక్య రాజ్య సమితి(యూఎన్) దర్యాప్తులో తేలింది. ఉక్రెయిన్‌లోని పౌరులపై యుద్ధ నేరాలకు రష్యా పాల్పడిందని యూఎన్‌కు చెందిన స్వతంత్ర అంతర్జాతీయ దర్యాప్తు కమిషన్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ నివేదికను వచ్చేవారం లాంఛనంగా యూఎన్‌కు సమర్పించనున్నది.
మానవాళికి వ్యతిరేకంగా బలవంతపు అదృశ్యాలు, చిత్రహింసలకు రష్యా అధికారులు పాల్పడ్డారని నివేదిక పేర్కొంది. రష్యా తన అధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాలలో ఉక్రెయిన్ పౌరులను పెద్ద సంఖ్యలో రష్యా నిర్బంధించిందని, వీరిలో కొందరిని రష్యాలోని ఆక్రమిత ఉక్రెయిన్‌లోని తాత్కాలిక కారాగారాలకు తరలించిందని నివేదిక పేర్కొంది. దీర్ఘకాలం సాగుతున్న నిర్బంధాలలో అదనంగా మరిన్ని మానవ హక్కుల ఉల్లంఘనలు, నేరాలకు రష్యా పాల్పడిందని తెలిపింది.