రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత్ వైఖరిని రష్యా ప్రశంసించింది. భారత్ చూపించిన సమతౌల్యం, సైద్ధాంతిక దృక్కోణం, స్వతంత్ర విధానాన్ని స్వాగతిస్తున్నట్లు రష్యా ప్రకటించింది.ఈ మేరకు భారత్లో రష్యా రాయబారి ట్వీట్ చేశారు. యూఎన్ భద్రతా మండలి వేదికగా భారత్ మాట్లాడుతూ… శాంతి మార్గాలతో పాటు దౌత్యం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ సూచించింది. అలాగే ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలను పెంచే ఏ చర్యనైనా అంగీకరించవద్దని, నిరోధించాలని భారత్ సూచించింది. ఈ వ్యాఖ్యలపైనే రష్యా స్పందించింది. భారత్ సమతౌల్యం, సిద్ధాంతాలను తాము ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.
ఇక… ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ శుక్రవారం స్పందించింది. రష్యా- ఉక్రెయిన్ వివాదంలో భారత ప్రభుత్వ వైఖరి తటస్థంగానే వుంటుందని పేర్కొంది. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా భారత్కు అటు అమెరికా, ఇటు రష్యా రెండూ ముఖ్యమే. అందుకే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తటస్థ వైఖరే సరైందని విదేశాంగ శాఖ పేర్కొంటోంది. ఇక యూరోపియన్ దేశాలతో కూడా ఇదే విషయంపై భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే, వైఖరిని స్పష్టం చేస్తోంది.