లండన్, అక్టోబర్ 12: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం దెబ్బ యూరప్‌పై భారీగానే పడింది. ఐరోపా దేశాలన్నీ విద్యుత్తు సంక్షోభంలోకి వెళ్తున్నాయి. 50 ఏండ్లలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్తు కోతలు విధించేందుకు బ్రిటన్ సర్కారు సిద్ధమవుతున్నది. యూకేలో 40 శాతానికి పైగా గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి జరుగుతున్నది. ఆ గ్యాస్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకొనేది. అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. దానికి ప్రతీకారంగా రష్యా యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. దీంతో ఈయూలో గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్ సహా ఐరోపా దేశాలు తీవ్ర విద్యుత్తు సమస్యను ఎదుర్కొంటున్నాయి.70 ఏండ్లలో ఎన్నడూ చూడని విద్యుత్తు కరువును ఇటలీ ఎదుర్కొంటున్నది. ఐరోపా బ్యాటరీగా పేర్కొంటున్న నార్వే రిజర్వాయర్లు కూడా సగం ఖాళీ అయ్యాయి. కాగా, శీతాకాలంలో కరెంటు కష్టాలు ఉంటాయని, వచ్చే ఏడాది పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని ఇప్పటికే యూకే నేషనల్ గ్రిడ్ స్పష్టం చేసింది. నిల్వ చేసిన లిక్విడ్ గ్యాస్ మొత్తం అయిపోతే శీతాకాలంలో ప్రతిరోజూ పవర్ కట్ ఉండొచ్చని చెప్తున్నది.
అడుగంటుతున్న గ్యాస్ నిల్వలు
రష్యా నుంచి దిగుమతి చేసుకున్న గ్యాస్ నిల్వలు వచ్చే శీతాకాలం వరకు అయిపోనున్నాయి. ఇప్పటికైతే ఎలాగోలా సంక్షోభాన్ని నివారించగలమని, వచ్చే ఏడాది మాత్రం విద్యుత్తు కొరత భయంకరంగా ఉంటుందని జియో స్ట్రాటజీ థింక్‌ట్యాంక్ కౌన్సిల్ కో ఫౌండర్ జేమ్స్ రోజర్స్ తెలిపారు. అమెరికా నుంచి అట్లాంటిక్ మీదుగా ప్రత్యేక కార్గో నౌకల్లో లిక్విడ్ గ్యాస్‌ను సరఫరా చేసుకోవాల్సి ఉంటుందని, అయితే, ఈయూ దేశాల్లో లిక్విడ్ గ్యాస్‌ను స్వీకరించే ప్రత్యేకమైన పోర్టులు లేవని వెల్లడించారు. ఇతర పోర్టులకు తరలించి, అక్కడి నుంచి సరఫరా చేసుకుందామన్నా.. పైప్‌లైన్ వ్యవస్థ లేదని వివరించారు.
గ్యాస్ సరఫరా చేస్తాం.. కానీ: పుతిన్
రష్యా నుంచి దిగుమతి చేసుకొనే ఆయిల్ ధరలపై నియంత్రణ విధించేందుకు ఐరోపా దేశాలు సమావేశమయ్యాయి. ఈ నిర్ణయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. నియంత్రణ విధించాలనుకోవటం ‘కోట్ల మంది ప్రజల (ఐరోపా ప్రజల) బాగోగులను తుంగలో తొక్కటమే’ అని వ్యాఖ్యానించారు. గ్యాస్ సరఫరాను పునరుద్ధరించేందుకు సిద్ధంగానే ఉన్నామని, అయితే, తక్కువ ధరకు మాత్రం అమ్మబోమని స్పష్టం చేశారు.
పెరుగుతున్న యాంటి నాటో నిరసనలు
అమెరికా నేతృత్వంలోని నాటోలో చేరటమే పెరుగుతున్న ధరలకు కారణమని యూరోపియన్లు భావిస్తున్నారు. అందుకే నాటో నుంచి బయటికి రావాలని ఆందోళన చేపడుతున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్‌లో పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. జీవన వ్యయం పెరగటం, భారీ గ్యాస్ ధరలు, కరెంటు కోతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజల్లో తీవ్ర అసహనానికి కారణమవుతున్నాయి. వెంటనే నాటో నుంచి వెనక్కి రావాలని, ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని, అధిక ధరలకు బాధ్యత వహిస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ రాజీనామా చేయాలని పారిస్‌లో నిరసనలు మిన్నంటాయి. ఒక్క ఫ్రాన్స్‌లోనే కాదు.. యూరప్ వ్యాప్తంగా యాంటి నాటో నినాదం ఊపందుకొంటున్నది.