పాట్నా : బీహార్‌లో వరుసగా అమ్మాయిల మీద లైంగిక వేధింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మొన్న జమయి జిల్లాలో ఇద్దరు మైనర్లు ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఆకతాయిలు అడ్డుకుని లైంగికంగా వేధించడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. గురువారం సమస్తిపూర్ జిల్లా జగత్సింగ్పూర్ గ్రామంలో మైనర్ అమ్మాయి మరో మైనర్ అబ్బాయితో రోడ్డుపై ఫొటోలు దిగుతూ ఉంటే.. కొందరు ఆకతాయిలు వచ్చి అమ్మాయిని లైంగికంగా వేధించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.
ఈ ఘటనలపై ఆహారం, వినియోగదారుల పరిరక్షణ శాఖ మంత్రి అశోక్ చౌదరిని రిపోర్టర్లు ప్రశ్నించారు. ఆయన స్పందిస్తూ.. ‘నేరాలు కొత్తవేం కాదు. బీహార్‌లో మాత్రమే కాదు అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్‌లోనూ జరుగుతున్నాయి. మేం చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గడిచిన ఐదు నెలల్లో లైంగిక దాడులు, వేధింపులు బీహార్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.