ఉక్రెయిన్ దేశంపై దాడులకు తెగబడిన రష్యా ప్రభుత్వంపై ప్రపంచ దేశాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది అయతే సోషల్ మీడియా వేదికగా రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చంపేస్తే ప్రపంచానికి చాలా మేలు కలుగుతుందని పోస్టులు చేశారు. అమెరికాలోని సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ కూడా ఇలాంటి ట్వీట్ ఒకటి చేశారు.
‘‘ఇది ఆగాలంటే ఒకటే దారి. రష్యాలోనే ఎవరైనా అతన్ని చంపేయాలి. అలా చేస్తే మీ దేశానికి, అలాగే ప్రపంచానికి చాలా గొప్ప సేవ చేసిన వాళ్లు అవుతారు’’ అని ఆమె ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌ను ఇతర రిపబ్లికన్లు తప్పుబట్టారు. అంతేకాదు, ఫ్రాన్స్ జనరల్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ మాట్లాడుతూ.. ప్రతి ఇంటలిజెన్స్ ఏజెన్సీ ముందు పుతిన్‌ను చంపడం అనే ప్లాన్ ఉందని అన్నారు.
ఇదిలా ఉండగా, తనపై హత్యాప్రయత్నం జరగొచ్చని పుతిన్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం విషప్రయోగం చేసే అవకాశం ఉందని అనుమానం రావడంతో.. తన చుట్టూ పనిచేసే దాదాపు వెయ్యి మందిని ఉద్యోగాల్లో నుంచి పుతిన్ తప్పించినట్లు సమాచారం. రష్యాలో ఇలా విషప్రయోగాలు చేయడం కొత్తేమీ కాదు. పుతిన్‌ను విమర్శించే అలెక్సీ నవలనీపై కూడా 2020లో విషప్రయోగం జరిగింది. దీనికి పుతినే కారణమంటూ అప్పట్లో పెద్ద గొడవే జరిగింది.