కీవ్: కీవ్‌పై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది రష్యా(Russia Attack). గత మూడేళ్లలో ఇంత భారీ స్థాయిలో రష్యా ఎప్పుడూ దాడి చేయలేదు. బోర్డర్ వద్ద భూమిని ఆక్రమించే ఉద్దేశంతో రష్యా తన దాడి ప్లాన్‌ను మరింత తీవ్ర తరం చేసింది. కీవ్‌లో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో 26 మంది గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చాలా కీలక సంభాషణ నిర్వహించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. వైమానిక రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలన్న అంశంపై ఇద్దరు నేతలు డిస్కస్ చేశారు. ఆయుధ ఉత్పత్తి అంశంలోనూ రెండు దేశాల మధ్య చర్చ జరిగింది. రష్యాతో యుద్ధాన్ని ఆపే అంశంపై కూడా ట్రంప్‌తో మాట్లాడినట్లు జెలెన్స్కీ తన స్టేట్మెంట్లో తెలిపాడు.
జెలెన్స్కీతో మంచి సంభాషణ జరిగిందని, యుద్ధం ఎప్పుడు ఆగుతుందన్న విషయాన్ని చెప్పలేనని, ఆ విషయం తనకు తెలియదని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల ఉక్రెయిన్‌కు సైనిక సామాగ్రిని పంపడంలో అమెరికా జాప్యం చేస్తున్నది. కీలకమైన ఎయిర్ డిఫెన్స్ మిసైళ్ల షిప్మెంట్ కూడా నిలిచిపోయింది. ఉక్రెయిన్‌లో స్వదేశీ ఆయుధ పరిశ్రమను నిర్మించాలని ఆశిస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. ఏడు గంటల పాటు తీవ్ర స్థాయిలో వైమానిక దాడి జరిగిందని జెలెన్స్కీ చెప్పారు.
గత కొన్ని రోజుల నుంచి ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడుల్ని తీవ్రతరం చేసింది. లాంగ్ రేంజ్ దాడులకు దిగుతోంది. వెయ్యి కిలోమీటర్ల బోర్డర్ ఏరియాలో ఉక్రెయిన్ దళాలపై రష్యా తీవ్ర వత్తిడి తెలుస్తున్నది. శుక్రవారం రాత్రి రష్యా సుమారు 550 డ్రోన్లు, మిస్సైళ్లు రిలీజ్ చేసింది. దీంట్లో ఎక్కువ శాతం షాహెద్ డ్రోన్లు ఉన్నాయి. 11 మిస్సైళ్లను కూడా రష్యా వదిలింది.