ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న పోరు వల్ల చాలా ప్రపంచ దేశాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి ధాన్యం ఎగుమతులు ఆగిపోవడంతో చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయని ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే టర్కీ అధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ నేతృత్వంలో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులతోపాటు ఐక్యరాజ్య సమితి, టర్కీ ప్రతినిధులు కూడా సమావేశమయ్యారు.
ఉక్రెయిన్లోని మూడు పోర్టుల నుంచి ధాన్యం ఎగుమతి చేసుకునేందుకు రష్యా అంగీకరించింది. అయితే ఆ మరుసటి రోజే ఒడెస్సా పోర్టుపై రష్యా మిసైల్స్ దాడి చేశాయి. ఈ దాడిని ఐక్యరాజ్య సమితి, అమెరికా, ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించాయి. రష్యా మాటలపై నమ్మకం ఉంచడమే తప్పంటూ దుయ్యబట్టాయి. ఈ క్రమంలో తాము ఎలాంటి దాడి చెయ్యలేదని రష్యా అధికారులు చెప్పినట్లు టర్కీ తెలిపింది.
అయితే ఈ ప్రకటనలను తుంగలో తొక్కుతూ రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా మాట్లాడుతూ.. ఒడెస్సా పోర్టులోని మిలటరీ ఇన్ఫ్రాస్టక్చర్పైనే ఈ దాడి జరిగినట్లు ప్రకటించారు. దీంతో మరోసారి పశ్చిమ దేశాలు రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఈ దాడిలో పోర్టులోని కొంత భాగం నాశనమైందని, కొంత మందికి గాయాలయ్యాయని ఒడెస్సా ప్రాంత గవర్నర మక్సీమ్ మార్చెంకో ప్రకటించారు.