AI | న్యూయార్క్, జూలై 13: కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో పైచేయి సాధించేందుకు బహుళజాతి సంస్థలు పోటీ పడుతున్నాయి. వందల కోట్లు ఖర్చు చేసి కొత్త ఫీచర్లతో ఉచితంగా ఏఐ చాట్బోట్లను అందుబాటులోకి తెస్తున్నాయి. వినియోగదారులు కూడా ఏఐని ఇష్టారీతిన వాడేస్తున్నారు. చిన్న మెయిల్ చేయడానికి కూడా ఏఐపైనే ఆధారపడుతున్నారు. ఫోటోలను, వీడియోలను సృష్టిస్తున్నారు. చిత్రవిచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ టైమ్‌పాస్ చేస్తున్నారు. అయితే, ఏఐ కూడా అమూల్యమైన వనరేనని, దీనిని బాధ్యతగా, పొదుపుగా వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ ఉచితంగానే సేవలు అందిస్తున్నప్పటీ పర్యావరణంపై మాత్రం భారం వేస్తున్నదని చెప్తున్నారు.
డాటా సెంటర్లలోని సూపర్ కంప్యూటర్ల ద్వారా ఏఐ పని చేస్తుంది. మనం ఏఐని అడిగే ప్రతి ప్రశ్నను ప్రాసెస్ చేసి సమాధానం ఇచ్చేది సూపర్ కంప్యూటర్లే. సూపర్ కంప్యూటర్లు పర్యావరణానికి హానికరంగా మారిన శిలాజ ఇంధనాలతో పని చేస్తున్నాయి. వీటి కోసం అణు ఇంధనాన్ని కూడా వినియోగిస్తుంటారు. దీనిపై ఇటీవల హగ్గింగ్ ఫేస్ అనే ఓ సంస్థ అధ్యయనం చేసింది. కేవలం చాట్‌జీపీటీకి చెందిన జీపీటీ3 మాడల్‌కు శిక్షణ ఇచ్చే క్రమంలో 500 మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అయ్యిందని ఈ అధ్యయనంలో తేలింది. ఒక పెట్రోల్ కారు 10 లక్షల కిలోమీటర్లు నడిస్తే ఉత్పత్తయ్యే కార్బన్ డయాక్సైడ్కు ఇది సమానం.
డాటా సెంటర్లు, సూపర్ కంప్యూటర్లు పని చేసేటప్పుడు విపరీతమైన వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడిని తగ్గించేందుకు భారీగా మంచినీరు అవసరమవుతుంది. దీంతో ఏఐ వినియోగం ఎంతగా పెరిగితే నీటి కొరత కూడా అంతగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాటా సెంటర్లలో వినియోగించే నీటిపై అనేక విమర్శలు ఉన్నాయి. ఏ కంపెనీ కూడా డాటా సెంటర్లకు ఎంత నీటిని వినియోగిస్తున్నాయని వెల్లడించడం లేదు. అయితే, అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఉన్న డల్లెస్ పట్టణంలో గూగుల్‌కు ఒక డాటా సెంటర్ ఉంది.
ఈ మొత్తం పట్టణానికి సరఫరా అవుతున్న నీటిలో పావు వంతు ఈ డాటా సెంటర్‌కు అవసరమవుతున్న విషయం ఓ కేసు ద్వారా వెలుగులోకి వచ్చింది. ఏఐ అందుబాటులోకి రావడం వల్ల సాంకేతికంగా కొన్ని లాభాలు ఉన్నాయి. ఇదే సమయంలో పర్యావరణానికి ఏఐ మరింత భారంగా మారింది. సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించుకోవడం వల్ల డాటా సెంటర్లు, సూపర్ కంప్యూటర్లపై భారం తగ్గుతుందని, ఇది పర్యావరణానికి మరో నష్టం చేసేదిగా మారకుండా ఉంటుందని పర్యావరణవేత్తలు అప్రాయపడుతున్నారు.