Zelensky | రష్యా చమురు (Russian Oil) కొనుగోలు కారణం చూపి భారత్ (India) సహా పలు దేశాలపై అగ్రారాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా సుంకాలు, ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ నిర్ణయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) తాజాగా స్పందించారు. ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించారు. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై ఆంక్షలు సరైన నిర్ణయమే అంటూ వ్యాఖ్యానించారు.
అమెరికన్ మీడియా ఏబీసీతో జెలెన్స్కీ మాట్లాడుతూ.. భారత్ సహా రష్యాతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను సమర్థించారు. ఈ చర్యను సరైన నిర్ణయంగా అభివర్ణించారు. ‘రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై సుంకాలు విధించాలన్న ఆలోచన సరైనదని నేను భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇటీవలే టియాంజెన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధినేత జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) కలిసి వేదిక పంచుకోవడంపై విలేకరుల ప్రశ్నకు జెలెన్స్కీ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఉక్రెయిన్‌లో శాంతి తీసుకువచ్చేందుకు తాజాగా జరుగుతున్న అన్ని ప్రయత్నాలను తాము స్వాగతిస్తున్నామని భారత్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. సాధ్యమైనంత త్వరితంగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాలని మానవాళి కోరుతోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి ప్రధాని మోదీ తెలియచేశారు. ఇరు దేశాల మధ్య సంధికి భారత్ ప్రయత్నిస్తున్నప్పటికీ న్యూ ఢిల్లీపై జెలెన్స్కీ నుంచి ప్రతికూల ప్రకటన వెలువడటం గమనార్హం.
Also Read..
Rekha Gupta | ప్రభుత్వ సమీక్షలకు సీఎం రేఖా గుప్తా భర్త.. ఢిల్లీ ప్రభుత్వంపై ఆప్ విమర్శలు
Gold Kalash | ఎర్రకోటలో భారీ చోరీ.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Encounter | జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం